12-11-2025 01:04:58 PM
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు ఘటన సంబంధించి మరో వీడియో బయటకు వచ్చింది. పేలుడు దృశ్యాలు ఎర్రకోట క్రాసింగ్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ టీవీలో(CCTV Footage) రికార్డు అయ్యాయి. ఎర్రకోట వద్ద రద్దీ సమయంలో ఒక్కసారిగా పేలుడు జరిగింది. ట్రాఫిక్ సమయంలో పేలుడుతో జనం భయాందోళనకు గురయ్యారు. పేలుడు కేసు దర్యాప్తులో ఈ సీసీ ఫుటేజ్ వీడియో కీలకంగా మారే అవకాశముందని ఢిల్లీ పోలీసులు (Delhi Police) తెలిపారు. సోమవారం సాయంత్రం జరిగిన పేలుడు ఘటనలో 12 మంది మృత్యువాత పడగా, పలువురు గాయపడ్డారు. పేలుడు తర్వాత దేశ రాజధాని అంతటా భద్రతను పెంచిన దృష్ట్యా, ముందుజాగ్రత్త చర్యగా లాల్ ఖిలా మెట్రో స్టేషన్ బుధవారం మూసివేశారు. మిగతా అన్ని స్టేషన్లు యథావిధిగా పనిచేస్తున్నాయని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (Delhi Metro Rail Corporation) తెలిపింది.
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు దాడిలో పాకిస్తాన్‌కు చెందిన జైష్-ఎ-ముహమ్మద్ ఉగ్రవాద సంస్థకు(Jaish-e-Mohammed terrorist organization) ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయానికి చెందిన రాడికలైజ్డ్ వైద్యులు పాల్గొన్నారని అధికారులు గుర్తించారు. ఎనిమిది మంది వైద్య నిపుణులు సహా 15 మంది అనుమానితులను భారత ఏజెన్సీలు అరెస్టు చేశాయి. ఢిల్లీ-ఎన్‌సిఆర్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, అస్సాం అంతటా సంబంధిత ప్రదేశాల నుండి 2,900 కిలోగ్రాముల అమ్మోనియం నైట్రేట్, అస్సాల్ట్ రైఫిల్స్‌ను స్వాధీనం చేసుకున్నాయి. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన పేలుడు ఘటనతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని, దేశ రాజధాని అంతటా భారీ తనిఖీలు నిర్వహిస్తున్నామని అధికారులు బుధవారం తెలిపారు. ఢిల్లీలోని అన్ని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద పారామిలిటరీ దళాలతో పాటు పోలీసు సిబ్బందిని పెద్ద సంఖ్యలో మోహరించారు. భద్రతా చర్యలలో భాగంగా నగరంలోకి ప్రవేశించే, బయలుదేరే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.