సర్ పేరుతో అసలైన ఓట్లు తొలగించే కుట్ర
మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
జాజిరెడ్డిగూడెం (అర్వపల్లి), జూన్15: తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు తొలగించే కుట్ర జరుగుతుందని మాజీ మంత్రి,సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. సోమవారం మండల కేంద్రం అర్వపల్లిలోని లక్ష్మీ ఫంక్షన్ హాల్ ల్లో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీ డిజిటల్ నమోదు, ప్రత్యేక ఓటరు జాబితా పరిశీలన(సర్) ప్రక్రియపై నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ,కాంగ్రెస్ లాగా దొంగ ఓట్లతో గెలవాలని తాము అనుకోమని,420 హామీలు ఇచ్చి ప్రజలను బురిడీ కొట్టించారని ఎద్దేవా చేశారు.సర్ పేరుతో దొంగ ఓట్లతో అసలైన ఓట్లను తొలగిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.చంద్రబాబు అండ్ మోడీ కలయికతో వచ్చిన హైబ్రిడ్ సీఎం ఈ రేవంత్ రెడ్డి నా మాట అధికారులు ఎవరూ వినడం లేదని... అనడం సిగ్గుచేటని,దేశంలో ఇలాంటి సీఎం ఎవరు ఉండరని దుయ్యబట్టారు.
రక్తపుటేరులు పారిన తుంగతుర్తి నియోజకవర్గాన్ని గోదావరి జనాలతో సస్యశ్యామలం చేసిన ఘనత బీఆర్‌ఎస్ పార్టీదని,నియోజకవర్గంలో 64శాతం బీఆర్‌ఎస్ కు అనుకూలంగా సర్వేలు చెబుతున్నాయన్నారు.రానున్న శాసనసభ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని,గాదరి కిషోర్ గెలుపును ఎవరు ఆపలేరన్నారు.జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉండి కూడా ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా,కళ్లాల్లోనే ధాన్యం తడిసే పరిస్థితి ఏర్పడిందన్నారు.
బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,సభ్యత్వాల జిల్లా ఇంచార్జీ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ బీజేపీ,కాంగ్రెస్ లు తమకు అనుకూలం కాని ప్రాంతాల్లో ఓట్లను తొలగిస్తూ కుట్రలు పన్నుతున్నారని,బూతు స్థాయి నాయకులు అప్రమత్తంగా ఉండకపోతే ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇప్పటివరకు సర్ ప్రక్రియ జరిపిన పశ్చిమబెంగాల్, కేరళ, పాండిచ్చేరి, తమిళనాడులో లక్షల ఓట్లను తొలగించారని బిజెపి అధికారంలో ఉన్న అస్సాంలో సర్ ప్రక్రియను నిర్వహించలేదని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్,మాజీ ఎంపీ,బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్,రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు,కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ గుజ్జ దీపికా యుగేందర్ రావు,రాష్ట్ర నాయకులు ధర్మేందర్ రెడ్డి,మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్,మున్సిపల్ చైర్మన్ రఘునందన్ రెడ్డి,మాజీ జెడ్పీటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు గుండగాని సోమేష్ గౌడ్,ప్రజా ప్రతినిధులు,బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు,బూత్ ఇంచార్జీలు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






