ధాన్యం కొనుగోళ్లను వెంటనే పూర్తి చేసి రైతులకు న్యాయం చేయాలి
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
చిట్యాల, జూన్ 15: రైతుల సమస్యలను ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకుని పెండింగ్లో ఉన్న ధాన్యం కొనుగోళ్లను వెంటనే పూర్తి చేసి రైతులకు న్యాయం చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కోరారు.
సోమవారం రామన్నపేట మండలంలోని దుబ్బాక, పల్లివాడ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను చిరుమర్తి లింగయ్య సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు, ముఖ్యంగా మహిళా రైతులు, ధాన్యం మార్కెట్ కల్లాల్లో పోసి మూడు నెలలు దాటినా కొనుగోళ్లు పూర్తి కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులు మాట్లాడుతూ, ధాన్యం కొనుగోళ్లలో జాప్యం కారణంగా ఆర్థిక భారం పెరుగుతోందని, వర్షాల వల్ల ధాన్యం నాణ్యత దెబ్బతింటుందనే ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలుగా పేరుకుపోయినా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు.
దీంతో రైతులు వడ్డీలు, కూలీల ఖర్చులు, రవాణా వ్యయాలతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు రావాల్సిన చెల్లింపులను సకాలంలో వారి ఖాతాల్లో జమ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్షాల కారణంగా ధాన్యం నష్టపోతే అందుకు ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకుని పెండింగ్లో ఉన్న ధాన్యం కొనుగోళ్లను వెంటనే పూర్తి చేసి రైతులకు న్యాయం చేయాలని చిరుమర్తి లింగయ్య కోరారు.






