calender_icon.png 16 July, 2025 | 7:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతడుపుల నాగరాజు కు ఘన సన్మానం

15-07-2025 11:19:19 PM

మందమర్రి,(విజయక్రాంతి): రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ సలహా మండలి సభ్యుడిగా నియమితులై తొలిసారి పట్టణానికి విచ్చేసిన అంతడుపుల నాగరాజుకు పట్టణ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గాండ్ల సంజీవ్, ప్రధాన కార్యదర్శి కడారి శ్రీధర్ తో పాటు పలువురు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడారు. నాగరాజుతో వారికున్న పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ధూంధాంను ఏర్పాటు చేసి, తెలంగాణ భావవ్యాప్తికి, ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడడానికి నాగరాజు చేసిన సేవలను కొనియాడారు.

అదేవిధంగా కళాకారుడిగా ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన చూపిన చొరవను ప్రశంసించారు. అనంతరం నాగరాజు మాట్లాడుతూ, తెలంగాణ మలిదశ ఉద్యమంలో అనేక మంది కళాకారులు, ఉద్యమ కారులు  తమ జీవితాన్ని త్యాగం చేసి, రాష్ట్ర సాధన కోసం  ఎనలేని  కృషి చేశారని గుర్తు చేశారు. స్వరాష్ట్ర సాధనలో కళాకారుల పాత్ర చిరస్మరణీయమని తెలిపారు. గత ప్రభుత్వం ఉద్యమకారుల త్యాగాన్ని విస్మరిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వారిని గుర్తించి, ప్రత్యేక గుర్తింపు అందించి, అక్కున చేర్చుకుంటుందని కొనియాడారు. పదవి ఏదైనా ఇన్నేళ్ల తన శ్రమకు దక్కిన గౌరవమని భావోద్వేగానికి లోనయ్యారు.

నటరాజ్ కళా నిలయం నుండి మొదలైన తన కళా ప్రస్థానంలో ఎందరో కళాకారులు, సన్నిహితులు, తన వెన్నంటి నడచి, ప్రోత్సహించారని తెలిపారు. ఈ సందర్బంగా సాంస్కృతిక శాఖ సలహా సభ్యుడిగా నియమించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు అందించే సంక్షేమ పథకాలను ప్రజలకు చేరేలా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తానన్నారు. అదేవిధంగా ప్రజా ఆకాంక్షలు నెరవేరని పక్షంలో మరల తన కళారూపంలో ప్రజా సమస్యలను పాలకుల దృష్టికి తీసుకువెళ్తానని, పదవులు ఉన్నా లేకున్నా ఎల్లప్పుడు ప్రజలతోనే తన ప్రయాణం అని స్పష్టం చేశారు.