30-07-2025 05:14:55 PM
జనగామ (విజయక్రాంతి): ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూలై 30న నిర్వహించే "వరల్డ్ డే ఎగైనెస్ట్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్" దినోత్సవాన్ని పురస్కరించుకొని, జనగామ రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని జిల్లా బాలల పరిరక్షణ యూనిట్(DCPU), కార్మిక శాఖ, చైల్డ్ హెల్ప్ లైన్ 1098, స్కోప్ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైల్వే సిబ్బంది, జీఆర్‌పి, ఆర్పీఎఫ్ పోలీసులు మరియు ప్రయాణికులకు మానవ అక్రమ రవాణా సంబంధించి అవగాహన కల్పించారు. ముఖ్యంగా రైలు మార్గాలు traffickers తరచుగా ఉపయోగించే మార్గాలు కావడంతో, ఏ చిన్న అనుమానాస్పద పరిస్థితులు కనిపించినా వెంటనే Child help line 1098, పోలీసు శాఖ లేదా సమీప అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించబడింది.
ఈ సందర్భంగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ ఉప్పలయ్య మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణా నిర్మూలన ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుని బాధ్యత కూడా అని చెప్పారు. రైల్వే సిబ్బంది, పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండటం చాలా కీలకమన్నారు. జిల్లా బాలల పరిరక్షణ అధికారి రవికాంత్ మాట్లాడుతూ.. చిన్నారులు, మహిళలు, వలస కూలీలు ముఖ్యంగా ఈ ముప్పుకు గురవుతుంటారని, రైల్వే స్టేషన్లలో ఒంటరిగా ఉండే చిన్నారులు, భయంతో కనిపించే మహిళలు లేదా యువత, ప్రశ్నలకు స్పష్టంగా సమాధానం చెప్పలేని వ్యక్తులు వంటి అనుమానాస్పద పరిస్థితులు గమనించినప్పుడు, వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 లేదా పోలీసు 100 లేదా112 నెంబర్లకు సమాచారం అందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్మిక అధికారి కుమారస్వామి, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ రవికుమార్, GRP హెడ్ కానిస్టేబుల్ ఉపేందర్, కానిస్టేబుల్ వెంకన్న, రైల్వే స్టేషన్ మాస్టర్ మల్లికార్జున్, స్కోప్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మనోజ్ కుమార్, సిబ్బంది లావణ్య,తరుణ్ ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు.