calender_icon.png 1 August, 2025 | 10:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దోషులెవరు?

01-08-2025 01:18:51 AM

  1. కాళేశ్వరం నివేదిక తెరిచే అధికారం క్యాబినెట్‌కే
  2. న్యాయ సలహా అనంతరం అసెంబ్లీకి
  3. ప్రాజెక్టులోని అవకతవకలపై సమావేశాల్లో చర్చ
  4. బాధ్యులను ప్రజల ముందుకు తీసుకొచ్చే అవకాశం
  5. స్థానిక ఎన్నికల ముందు బహిర్గతం చేసే యోచన
  6. కమిషన్ తుది నివేదికలోని అంశాలపై సర్వత్రా ఉత్కంఠ

హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని అవినీతిని నిగ్గుతేల్చేందుకు ఏర్పాటు చేసిన న్యాయ విచారణ కమిషన్ నివేదికను గురువారం సీల్డ్ కవర్‌లో ప్రభుత్వానికి సమర్పించింది. అయితే జ్యుడీషియల్ కమిషన్ ఇచ్చిన నివేదికను తెరిచే అధికారం కేవలం రాష్ట్ర మంత్రివర్గానికి మాత్రమే ఉంటుంది. ఈక్రమంలో కాళేశ్వరం నివేదికలోని అంశాలు కూడా వచ్చే క్యాబినెట్ సమావేశంలో చర్చకు వస్తాయని తెలుస్తోంది.

క్యాబినెట్‌లో చర్చించిన అనంతరం నివేదిక ను న్యాయ సలహాకు పంపే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు సమా చారం. న్యాయ సలహా తర్వాతనే అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ లేవనెత్తాలని చూస్తున్నది. ప్రాజెక్టులో జరిగిన అవకతవకల గురించి క్యాబినెట్‌లో చర్చించి బహిర్గతం చేయడం కంటే అసెంబ్లీలో చర్చిస్తే దోషులెవరో, బాధ్యులెవరో ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుందని ప్రభుత్వం ఆలోచిస్తున్న ట్టు తెలుస్తోంది.

గత ప్రభుత్వ హయాం లో జరిగిన అవినీతి ప్రజల ముందు ఉంచడంతోపాటు సమావేశాల సందర్భంగా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తునకు ఆదేశించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. 

సుదీర్ఘ విచారణకు తెర..

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలు, అవినీతి, బరాజ్‌ల కుంగుబాటుపై 16 నెలలపాటు సుదీర్ఘంగా సాగిన విచారణకు జూలై 31వ తేదీతో తెరపడింది. జస్టిస్ పీసీ ఘోష్ నివేదికను ప్రభుత్వానికి అందించారు. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రభుత్వానికి చేరడంతో అటు ప్రజల్లో, ఇటు అధికార యంత్రాంగంలో ఆసక్తి నెలకొంది.

ప్రాజెక్టుకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈట ల రాజేందర్ ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో తుది నివేదిక మరింత కీలకంగా మారింది. అయితే ప్రాజెక్టు నిర్మాణమంతా గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే జరిగిందని అధికారులు, ఇంజినీర్లు విచారణలో చెప్పగా, టెక్ని కల్ కమిటీల నివేదికల ఆధారంగా క్యాబినెట్ ఆమోదంతో ఇంజినీర్లు నిర్మించారని కేసీఆర్, హరీశ్‌రావు వెల్లడించారు.

దీంతో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు, బరాజ్‌ల కుంగుబాటు బాధ్యత గత ప్రభుత్వ పెద్దలకు వర్తిస్తుందా? ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన అధికారుల మెడకు చుట్టుకుంటుందా అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈక్రమంలో కమిషన్ ఇచ్చిన నివేదికలోని అంశాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

స్థానిక ఎన్నికలకు ముందు.. 

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కాళేశ్వరం ప్రాజెక్టు కీలకంగా వ్యవహ రించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌లు కుంగిపోయాయి. నిర్మాణంలోని అవకతవకలు, అవినీతి కారణంగానే బరాజ్‌లు కుంగిపోయాయని ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపించింది. ఈ అంశాన్ని ఎన్నికల ప్రచారంలోనూ ఎక్కువగా ప్రస్తావించింది.

ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు కుంగిపోవడంతో ప్రజల్లోనూ బీఆర్‌ఎస్‌పై అసంతృప్తి పెరిగి కాంగ్రెస్ వైపు మొగ్గుచూపినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. ప్రస్తుతం కాళేశ్వరం విచారణ కమిషన్ నివేదికను మరోసారి తమకు అనుకూలంగా మలుచుకోవాలని కాంగ్రెస్ భావించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిని ప్రజల ముందు పెట్టి, లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహ రచన చేస్తున్నది. ఈ క్రమంలో స్థానిక ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యే లోపు కమిషన్ ఇచ్చిన నివేదికను క్యాబినెట్‌లో చర్చించి, అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. 

కీలక నేతలతో కేసీఆర్ భేటీ..

మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గురువారం ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో పార్టీ ముఖ్యనేతలు హరీశ్‌రావు, కేటీఆర్, జగదీశ్‌రెడ్డితో భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ నివేదిక ప్రభుత్వానికి అందిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధా న్యం సంతరించుకున్నది.