calender_icon.png 1 August, 2025 | 10:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఏఎస్‌లు అయితే చర్యలుండవా!

01-08-2025 01:46:43 AM

  1. నీటిపారుదల, ఆర్థిక శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలపై చర్యలు తీసుకోవాలి 
  2. సిఫారసు చేసిన కాళేశ్వరం విజిలెన్స్ కమిషన్
  3. కమిషన్ సిఫారసులకు సర్కారు తిలోదకాలు

హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు, అవకతవకలు అంటూ మొదటి నుంచి బలంగా విమర్శిస్తూ వచ్చిన కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడిన తరువాత విచారణ సంస్థల సిఫారసుల ప్రకారం చర్యలు తీసుకోవడంలో మాత్రం అంత వేగంగా అడు గులు వేయడం లేదు.

2023 డిసెంబరులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం.. కాళేశ్వరం ప్రాజెక్టుపై విజలెన్స్ విచారణకు ఆదేశించడం.. ఆపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేయడం చాలా వేగంగా సాగింది. అయితే విజిలెన్స్ విచారణ నివేదిక వచ్చినప్పటికీ.. చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కపెడుతుందనే ఆరోపణలున్నాయి.   

విజిలెన్స్ కమిషన్ నివేదిక

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు తరువాత కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్, ఎన్‌ఫో ర్స్‌మెంట్ విచారణకు ఆదేశించింది. దాదా పు ఏడాదికిపైగా విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం చేసిన విచారణలో అత్యంత కీలకమైన సమాచారం, రికార్డులు, ఫైళ్లు బయట కు వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్, నిర్మాణ ప్రారంభ పనుల నుంచి మొదలుకుని.. 2023 అక్టోబర్‌లో మేడిగడ్డ బ్యారేజీ ఏడో నెంబరు బ్లాక్ కుంగుబాటు వరకు అస లు ఏం జరిగింది.. ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయి.. ఎవరి బాధ్యత ఎంతవరకు ఉం ది.. ఎవరెవరిపై చర్యలు తీసుకోవాలి.

ఎవరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.. తదితర అన్ని అంశాలతో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం రాష్ట్ర విజిలెన్స్ కమి షన్‌కు నివేదికను ఇచ్చింది. దీనిని పరిశీలించిన విజిలెన్స్ కమిషన్ ఎవరెవరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.. ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది సిఫా రసు చేస్తూ.. 18.3.2025న రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందించింది. దాదాపు 10 పేజీల విజిలెన్స్ కమిషన్ నివేదికలో.. ఆర్థిక శాఖ, నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలతోపాటు బాధ్యులైన వారి సబార్డినేట్స్‌పై కూడా చర్యలు తీసుకునేందుకు ఆలోచించాలని స్పష్టంగా సిఫారసు చేసింది. 

ఐఏఎస్‌లు అయితే చర్యలుండవా?

బాధ్యులైనవారిని పేర్కొంటూ చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ కమిషన్ సిఫారసులను 18.3.2025న ప్రభుత్వానికి  కమిషన్ లేఖ రాసింది. అంటే ఇప్పటికి దాదాపు నాలుగున్నర నెలల కాలం గడిచింది. ఇప్పటివరకు అటు ఆర్థిక శాఖ, ఇటు నీటిపా రుదల శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలుగా (విజిలెన్స్ కమిషన్ పేర్కొన్న ఏప్రిల్ 2015 నుంచి 21.10.2023 వరకు) పనిచేసిన ఐఏఎస్ అధికారులపై చర్యలు తీసుకోవడానికి మాత్రం ప్రభుత్వం జంకుతూనే ఉన్నట్టు కనపడుతోంది.

విజిలెన్స్ కమిషన్ పేర్కొన్నట్టు.. కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ చేసినప్పటి నుంచి మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌కు పగుళ్లు వచ్చి కుంగినప్పటి వరకు నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ/స్పెషల్ చీఫ్ సెక్రటరీలుగా పలువురు పనిచేశారు. గతంలో సీఎస్‌గా చేసి రిటైర్డ్ అయిన ఎస్.కె. జోషి అంతకుముందు నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా, స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేశారు.

తరువాత వికాస్‌రాజ్ నీటి పారుదల శాఖ సెక్రటరీగా, ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. 2021 జనవ రి, ఫిబ్రవరిలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన సోమేశ్‌కుమార్ నీటిపారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగాకూడా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత రజత్‌కుమార్ 2021 ఫిబ్రవరి నుంచి 2023 నవంబర్ వరకు నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా, స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. వీరెవరికీ నోటీసులు ఇవ్వలేదు. చర్యలు తీసుకోలేదు. 

 ప్రభుత్వం వెనకడుగా.. ముందడుగా..

కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి, అక్రమాలు, అవకతవకలు జరిగాయని బలంగా చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ సంస్థల నుంచి వచ్చిన నివేదికల ప్రకారం చర్యలు తీసుకోవడానికి మాత్రం ఎందుకో తాత్సారం చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఎంత బలంగా విమర్శలు చేశారో.. అంతే వేగంగా విచారణకు ఆదేశించిన ప్రభుత్వం.. చర్యల విషయంలో మాత్రం ఆ వేగాన్ని ప్రదర్శించడం లేదనే విమర్శలు వినపడుతున్నాయి.

పైపెచ్చు.. కేవలం ఇంజినీ ర్లనే బాధ్యులుగా చేస్తున్నారని, ప్రాజెక్టులకు సారథ్యం వహించిన ఉన్నతాధికారులు, ఐఏఎస్‌లపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం అంతగా సుముఖంగా లేదనే సంకేతాలు స్పష్టంగా కనపడటంపై కూడా విమర్శలు వస్తున్నాయి. కుటుంబాలకు దూరంగా క్షేత్రస్థాయిలో పనులు చేస్తున్న తమలాంటి కింది స్థాయి ఉద్యోగులపై ప్రభుత్వం చర్యల పేరు తో కొరడా ఝులిపిస్తోంది. అదే విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన నివేదికలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ.. ఉన్నతస్థాయి అధికారులు, ఐఏఎ స్‌లపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం జంకుతోంది.

 2015 నుంచి2023 మధ్యకాలంలో పనిచేసినవారే..

 కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ చేసినప్పటి నుంచి అంటే.. ఏప్రిల్ 2015 నుంచి మేడిగడ్డ బ్యారేజీ ఏడవ బ్లాక్ కుంగిన వరకు.. అంటే 21.10.2023 వరకు ఈ ఆర్థిక, నీటిపారుదల రెండు శాఖలకు ప్రిన్సిపల్ సెక్రటరీలుగా పనిచేసినవారితోపాటు బాధ్యులైన వారి సబార్డినేట్స్‌పై చర్యలు తీసుకోవడానికి ఆలోచించాలంటూ స్పష్టంగా పేర్కొ న్నారు. ఇందుకు ప్రధాన కారణాలను తెలుపుతూ ప్రాజెక్టు విషయంలో వచ్చిన ప్రతిపాదనల లోటుపాట్లను చూడకుండా గుడ్డిగా ఆమోదించడం వలన వారిపై చర్యలు తీసుకో వడానికి ఆలోచించాలంటూ విజిలెన్స్ కమిషన్ స్పష్టంగా పేర్కొంది.