calender_icon.png 1 August, 2025 | 10:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల దీవెనలకే జనహిత

01-08-2025 01:08:10 AM

ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ పథకాలు

  1.    42% బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటోంది: కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి
  2. హామీలన్నీ అమలుచేస్తున్నాం: పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
  3. అర్హులందరికీ సంక్షేమ పథకాలు: మంత్రి శ్రీధర్‌బాబు
  4. పరిగి నియోజకవర్గం రంగాపూర్ వద్ద జనహిత పాదయాత్ర ప్రారంభం

వికారాబాద్, జూలై -31 (విజయక్రాంతి): తెలంగాణలో అమలుచేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను దేశంలోని పలు రాష్ట్రాలు రోల్‌మోడల్‌గా తీసుకుంటున్నాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్  మీనాక్షి నటరాజన్ చెప్పా రు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆశీర్వాదం కోసమే జనహిత పాదయాత్ర చేపట్టినట్టు చెప్పారు. గురువారం వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని రంగాపూర్ వద్ద జనహిత పాదయాత్రను ఆమె ప్రారంభించారు.

ఈసందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి తదితరులతో కలిసి ఆరు కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. అనంతరం పరిగిలో ఏర్పాటుచేసిన సభలో  మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. తెలంగాణలో చేపట్టిన కులగణనను ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. రాహుల్‌గాంధీ అనేక సందర్భాల్లో తెలంగాణలో చేపడుతు న్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించడం చూస్తున్నామన్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నట్లు చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పేదలకు సన్నబియ్యం, అర్హులకు తెల్లరేషన్‌కార్డు, పంట రుణమాఫీ వంటి ఎన్నో పథకాలు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తోందన్నారు. రాహుల్‌గాంధీ భారత్ జోడోయాత్రతో 3,500 కిలోమీటర్లు తిరిగి ప్రజల మనోగతాన్ని తెలుసుకు న్నట్లు చెప్పారు.

రాహుల్‌గాంధీని అనుసరిస్తూనే జనహిత పాదయాత్రకు తాము బయలుదేరినట్లు తెలిపారు. కులగణనతో బీసీల కు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. 42శాతం బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేసేందుకు ప్రయత్నిస్తుంటే, బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు.

42 శాతం బీసీ రిజర్వేషన్లను సాధించుకునేందుకు ఆగస్టు 6న ఢిల్లీలో చేపట్టిన మహాధర్నాకు ప్రజల ఆశీర్వాదం కావాలన్నారు. బీసీల న్యాయ పోరాటానికి రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ, ఖర్గే తదితర ముఖ్యనేతలు తరలిరానున్నట్లు పేర్కొన్నారు. 

నిత్యం ప్రజల్లోనే ఉంటాం: పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్    

పాదయాత్రల ద్వారానే మహాత్మాగాంధీ నుంచి నేటి రాహుల్‌గాంధీ వరకు దేశాన్ని సమూలంగా అర్థం చేసుకోగలిగారని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ చెప్పారు. రాహుల్‌గాంధీ  భారత్ జోడోయాత్ర చరిత్ర పుటల్లోకి ఎక్కిందన్నారు. తెలంగాణలో అధికారం లో ఉన్నామని, నాయకులు హైదరాబాద్‌లో ఉంటే సరిపోదని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాదయాత్ర గురించి దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా నిత్యం ప్రజల్లో  ఉండే పార్టీ అన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఎన్ని అప్పులు చేశారో ప్రజలకు తెలుసన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలుచేస్తున్నామన్నారు. రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి చెందుతుందన్నారు. కాంగ్రెస్ కుటుంబ పాలన కాదు, రాష్ర్టంలో కుటుంబ పాలన అంతమొందించాలనే ఉద్దేశంతో  ప్రజలు తమకు అధికారం ఇచ్చారని తెలిపారు. ఇంకా మిగిలిన మూడేళ్లలో  ప్రజాపాలన బంగారు పాలన చేస్తామన్నారు.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

కాంగ్రెస్ ప్రజాపాలనలో అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. మ్యానిఫెస్టోలో పెట్టిన అన్ని హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి వారి కల నిజం చేస్తున్నామన్నారు. రేషన్‌లో సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, కాలె యాదయ్య, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.