calender_icon.png 1 August, 2025 | 10:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నానో యూరియాపై అవగాహన కరువు

01-08-2025 12:33:26 AM

-వాడకంపై రైతుల విముఖత

-తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి

-అవగాహన కల్పించని వ్యవసాయ అధికారులు

దౌల్తాబాద్, జూలై 31: వ్యవసాయ రంగం మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రపంచ వ్యవసాయం టెక్నాలజీని అందిపుచ్చుకుని కొత్త పుంతలు తొక్కుతోంది. సాగు ఖర్చులను తగ్గించి అధిక దిగుబడి సాధించేందుకు విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రైతులు మారుతున్న కాలానికి అనుగుణంగా పంటల సాగు చేపడితే లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. రైతులు పాత పద్ధతులను అనుసరించి మూస ధోరణిలోనే వెళ్లడంపై నష్టాలను చవి చూడాల్సి వస్తోంది.

పంటలకు వేసే సాధారణ ఎరువుల స్థానంలో నానో యూరియా ద్రవ రూపంలో వచ్చింది. ముఖ్యంగా రైతులు ధర తక్కువగా ఉండే నానో ఎరువులు వాడితే ఖర్చు తగ్గి దిగుబడులు పెరుగుతాయని వ్యవసాయ శాఖ నిపుణులు అంటున్నారు. మార్కెట్లోకి తెచ్చిన వీటి వినియోగంపై వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించడం లేదు.

అనేక ప్రయోజనాలు...

ద్రవ రూపంలో ఉన్న నానో యూరియాతో రైతులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రస్తుతం వాడుతున్న సాధారణ యూరియాను పంటకు చల్లడం ద్వారా కేవలం 30 శాతం మాత్రమే పంటకు వెళుతుందని, అదే నానో యూరియాతో ఖర్చు తక్కువగా 80% పంటకు వెళుతుందని అధికారులు చెబుతున్నారు. అర లీటర్ డబ్బాలు లభించే నానో యూరియా 45 కిలోల యూరియా బస్తా తో సమానం రాయితీ పోను యూరియా బస్తా ధర రూ. 266 ఉండగా నానో యూరియా రూ. 240 కే లభిస్తుంది. యూరియా తర్వాత రసాయన నానో డిఏపి ని అందుబాటులోకి తెచ్చారు. ఒక బస్తా డిఏపి కి 500 మిల్లీలీటర్ల నానో డిఏపి బాటిల్ తో సమానం. బస్తా డిఏపి ధర రూ. 1350 ఉండగా నానో డిఏపి దాదాపు రూ. 300కే లభిస్తుంది

అవగాహన కల్పిస్తే మేలు

మండల వ్యాప్తంగా రైతులు 21 వేల ఎకరాలు వివిధ పంటలను సాగు చేస్తున్నారు. వివిధ పంటలకు దాదాపు 9 వందల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం. ఎరువుల ధరలు రైతులకు భారంగా మారుతున్నాయి. ఈ క్రమంలో నానో యూరియా రైతులకు వరంగా మారింది. అయితే చాలామంది రైతులు అవగాహన లేక నానో యూరియాను వినియోగించడం లేదు. వ్యవసాయ అధికారులు గ్రామాల్లోకి వెళ్లి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

రైతులకు అవగాహన కల్పిస్తాం 

నానో యూరి యా వాడకంపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తాం. సాధారణ యూరియా కంటే నానో యూరియా వాడకం వల్ల రైతులకు మేలు జరుగుతుంది. పంటలకు నానో యూరియా ఎక్కువ మొత్తంలో త్వరగా చేరుతుంది..

 సాయి కిరణ్, మండల వ్యవసాయ అధికారి దౌల్తాబాద్