calender_icon.png 1 August, 2025 | 10:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

3 నెలల్లో తేల్చాలి

01-08-2025 01:38:38 AM

ఎమ్మెల్యేల అనర్హత కేసు 

సుప్రీంకోర్టు తుదితీర్పు

ఆలస్యాన్ని నివారించేందుకే కాలపరిమితి నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకరే

* తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని చెప్పి డివిజన్ బెంచ్ తప్పుచేసింది. స్పీకర్ ఒక న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూనే హైకోర్టు, సుప్రీంకోర్టు అధికార పరిధికి లోబడి ఉండే ట్రైబ్యునల్‌గా వ్యవహరిస్తారు. అయితే స్పీకర్ రాజ్యాంగపరమైన రక్షణను పొందలేరు. తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును పక్కనపెడుతున్నాం. 

సుప్రీం కోర్టు

  1. ఫిరాయింపులతో ప్రజాస్వామ్య మనుగడకు విఘాతం
  2. ఈ విషయాన్ని పార్లమెంట్ సమీక్షించాలి..

న్యాయనిపుణులతో చర్చిస్తాం : సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత, న్యాయ నిపుణులతో చర్చించిన మీదట ముందుకెళ్తాం. గతంలోనే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశాం. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం. 

 గడ్డం ప్రసాద్‌కుమార్

* సుప్రీం తీర్పును స్పీకర్ గౌరవించాలి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

* సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం : బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు రాంచందర్‌రావు 

న్యూఢిల్లీ, జూలై 31: పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం గురువారం స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న విజ్ఞప్తిని సుప్రీం తోసిపుచ్చింది.

అసెంబ్లీలో అనర్హత పిటిషన్లు పెండింగ్‌లో ఉండడానికి అనుమతించడం ద్వారా ‘ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్’ అన్న సూత్రం వర్తించకూడదని వ్యాఖ్యానించింది. దీనివల్ల ఫిరాయింపుదారులు ఆలస్యం ప్రయోజనాలను పొందుతారని పేర్కొంది. దాదాపు ఏడు నెలలుగా అనర్హత పిటిషన్లపై స్పీకర్ నోటీసు కూడా జారీ చేయలేదని తెలిపింది.

ఈ కేసులో స్పీకర్ ఆదేశాలు జారీ చేయడంలో వైఫల్యం రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ లక్ష్యాన్ని దెబ్బతీస్తుందని అభిప్రాయపడింది. అనర్హత పిటిషన్లను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు విచారణను పొడిగించడానికి అనుమతించవద్దని స్పీకర్‌ను కోర్టు ఆదేశించింది.

ఎమ్మెల్యేలు అన ర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా ఆల స్యం చేసే ఎత్తుగడలు వేస్తే వారిపై ప్రతికూల చర్యలు తీసుకోవచ్చని కోర్టు తెలిపింది. 2023 నవంబర్‌లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కారు గుర్తుపై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు.. ఆ తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కాంగ్రెస్ కండువా కప్పుకున్న దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడి యం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికపూడి గాంధీ, కాలె యాదయ్య, బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, డాక్టర్ సంజయ్, ప్రకాశ్‌గౌడ్‌పై అనర్హత వేటు వే యాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానందగౌడ్, పాడి కౌశిక్‌రెడ్డి వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌తో పాటు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన రిట్ పిటిష న్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు తుది తీర్పు నేపథ్యంలో సుప్రీంకో ర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 

ఫిరాయింపులు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తాయి..

రాజకీయ ఫిరాయింపులు జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారాయని, వీటి ని అరికట్టకపోతే ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే శక్తి వాటికి ఉందని సుప్రీం అభిప్రాయపడిం ది. వివిధ సందర్భాల్లో ఈ అంశంపై పార్లమెంట్‌లో చేసిన ప్రసంగాలను కూడా పరి శీలించామని సీజేఐ తెలిపారు. ‘రాజేశ్ పైల ట్, దేవేంద్రనాథ్ మున్షీలా..అనర్హత చర్యలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం కోర్టుల ముందు జాప్యాన్ని నివారించడమే.

పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కు కట్టబెట్టారు. ఆర్టికల్స్ 136, 226, 227లకు సంబంధించి న్యాయసమీక్ష అధికారాలు చాలా పరిమితంగా ఉన్నాయి. తెలం గాణ హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాల్లో జో క్యం చేసుకోలేమని డివిజన్ బెంచ్ తప్పుచేసింది. స్పీకర్ ఒక న్యాయనిర్ణేత అధికారిగా వ్యవహరిస్తూనే హైకోర్టు, సుప్రీంకోర్టు అధికార పరిధికి లోబడి ఉండే ట్రైబ్యునల్‌గా వ్య వహరిస్తారు. స్పీకర్ అలా వ్యవహరిస్తూనే రాజ్యాంగపరమైన రక్షణను పొందలేరు.

తె లంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును పక్కన పెడుతున్నాం. ఒక ముఖ్యమైన నిర్ణయంలో శాసనసభ స్పీకర్లు ప్రజా స్వామ్యానికి ప్రమాదం కలిగించే ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకునే విష యంలో ఆలస్యం చేస్తారు. కాబట్టి పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎమ్మెల్యేల అనర్హతపై ప్రస్తుతం ఉన్న యంత్రాంగాన్ని పార్లమెంట్ సమీక్షించాలి. ఇలాంటి చర్యలు ఏళ్ల తరబడి సాగడం వల్ల అర్థరహితంగా మారుతుంది.’ అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 

ఏ రోజు ఏం జరిగింది?

* ఏప్రిల్, 2024: పార్టీ మారిన ఎమ్మెల్యేలు పది మందిని అనర్హులుగా ప్రక టించాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి.

* 9 సెప్టెంబర్, 2024: నాలుగు వారాల్లో విచారణ షెడ్యూల్ ఇవ్వాలని స్పీకర్ కార్యాలయాన్ని జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి బెంచ్ ఆదేశించింది.

* 22 నవంబర్, 2024: హైకోర్టు డివిజన్ బెంచ్, సింగిల్ బెంచ్ ఆదేశాలను రద్దు చేస్తూ.. స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం.. రీజనబుల్ టైం కావాలంటూ వ్యాఖ్య. స్పీకర్‌కు షెడ్యూల్ ఖరారు చేయాల్సిన అవసరం లేదని స్పష్టీకరణ.

* జనవరి 2025: హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును పిటిషనర్లు అయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి,  వివేకానంద, కేటీఆర్ ఆశ్రయించారు.

* 10, ఫిబ్రవరి 2025:  పార్టీల హక్కులు నిర్లక్ష్యం చేయబడకూడదు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ.. స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన ‘రీజనబుల్ టైమ్’ ఎంత? అని ప్రశ్నించింది.

* 18, ఫిబ్రవరి 2025: సుప్రీంకోర్టు తదుపరి విచారణకు తేదీ నిర్ణయించింది. స్పీకర్ సమాధానం కోసం వేచిచూసింది.

* 4, మార్చి 2025: కోర్టు స్పీకర్, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

* 3, ఏప్రిల్ 2025: ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లపై వాదనలు ముగిశాయి. అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.

* 31, జూలై 2025: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత విషయమై మూడు నెలల కాలపరిమితి విధిస్తూ తుది తీర్పు వెలువరించింది. 

పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు

  1. దానం నాగేందర్
  2. తెల్లం వెంకట్రావు
  3. కడియం శ్రీహరి
  4. పోచారం శ్రీనివాస్‌రెడ్డి
  5. అరికపూడి గాంధీ
  6. కాలె యాదయ్య
  7. బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
  8. గూడెం మహిపాల్‌రెడ్డి
  9. డాక్టర్ సంజయ్
  10. ప్రకాశ్ గౌడ్