25-10-2025 12:00:00 AM
జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశాలను కూడా పట్టించుకోని అధికారులు
హుస్నాబాద్, అక్టోబర్ 24 : సిద్దిపేట జిల్లా జిల్లెలగడ్డ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 8వ తరగతి విద్యార్థి సనాదుల వివేక్ (13) అనుమానాస్పద మృతిపై నెలకొన్న మిస్టరీ ఇంకా వీడడంలేదు. ఇరవై రో జులు కావస్తున్నా వాస్తవాలు వెలుగులోకి రావడం లేదు. అధికారుల దర్యాప్తు తీరుపై జాతీయ ఎస్సీ కమిషన్ తీవ్ర అసంతృప్తి వ్య క్తం చేసినా, పరిస్థితిలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు.
గురుకుల టీచర్ల నిర్లక్ష్యం పై వారం రోజుల్లో చర్యలు తీసుకోవాలన్న కమిషన్ డైరెక్టర్ సునీల్ కుమార్ బాబు ఆదేశాలను సైతం జిల్లా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నా యి. వివేక్ మృతి వెనుక బలమైన అనుమానాలు ఉన్నప్పటికీ, పోలీసులు, ఉన్నతాధికా రులు కీలక ఆధారాలను విస్మరిస్తున్నారా అ నే సందేహం కలుగుతోంది. సాక్ష్యాల సేకరణలో ఆలస్యం, దర్యాప్తు వేగం మందగిం చ డం గురుకుల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను రక్షించే ప్రయత్నం జరుగుతోందా అనే ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి.
విద్యార్థిది హత్యేనని భావించడానికి పలు కారణాలు ప్రచా రంలో ఉన్నాయి. అత్యంత సంచలనాత్మకమై న ఆరోపణ ఏంటంటే... వివేక్ ను ఓ టీచర్ వెంటపడి, వెనుక నుంచి కాలర్ పట్టుకొని లాగడంతో, వివేక్ మెడలో ఉన్న తన బాక్సు తాళంచెవిల దారం గొంతు వద్ద సున్నితమై న ప్రదేశం వద్ద బిగుసుకొని, ప్రాణం కోల్పోయాడని ప్రచారం జరుగుతోంది. మరోవైపు కొందరు విద్యార్థులు హాస్టల్ గదుల్లో రాత్రి వేళల్లో మద్యం ఇతర మత్తు పదార్థాలు సేవిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఈ మత్తులోనే ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారనే భయంకరమైన విషయాలు వెలు గులోకి వస్తున్నాయి. దీనిని అధికారులు తొక్కిపెట్టడంలో ఆంతర్యమేమిటని పలువు రు విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడు తు న్నారు. విద్యార్థుల మధ్య జరుగుతున్న అరాచకాలకు ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు ఏమా త్రం పర్యవేక్షణ లేకుండా వదిలేయడమే ఈ దుర్ఘటనకు దారితీసిందనే ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. ఇదే కాకుండా పరీక్షల్లో ఉ పాధ్యాయులే ఆన్సర్లు చెప్పి తప్పుడు రిజల ట్స్ ను పై అధికారులకు పంపుతున్నారనే ఆరోపణలు కూడా గురుకులంలో నెలకొన్న అవినీతి, నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి.
ఎస్సీ కమిషన్ ఆదేశాలకు విలువ లేదా?
విద్యార్థి మృతిపై దర్యాప్తులో జాప్యం, నిర్లక్ష్యంపై జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సు నీల్ కుమార్ బాబు తీవ్రంగా స్పందించారు. వారం రోజుల్లోగా ఉపాధ్యాయులు, సంబంధిత సిబ్బందిపై తీసుకున్న చర్యల వివరాల ను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. వివేక్ తల్లిదండ్రులు కడుపుకోతతో క మిషన్ అధికారుల కాళ్లు పట్టుకొని న్యాయం చేయాలని వేడుకున్నారు. వారి ఆర్తనాదం, కమిషన్ కఠిన ఆదేశాలు కూడా అధికారులను కదిలించలేకపోయాయి.
కమిషన్ ఆదే శాలు జారీ అయి వారం రోజులు గడిచిపోయినా నిర్లక్ష్యానికి బాధ్యులైన ఉపాధ్యాయు లు, సిబ్బందిపై ఇప్పటివరకు ఎలాంటి శాఖాపరమైన చర్యలు తీసుకోలేదు. అధికారుల ఈ తీరు ఉపాధ్యాయులను కాపాడాలనే స్పష్టమైన ప్రయత్నంగా కనిపిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. విద్యార్థి భద్రతకు బాధ్య త వహించాల్సిన ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోకుండా, మిస్టరీని ఛేదిం చే దిశగా బలమైన అడుగులు వేయకుండా అధికారులు ఎందుకు వెనుకాడుతున్నారనే ప్రశ్నలు సర్వత్రా వస్తున్నాయి.
ఈ నిర్లక్ష్యానికి కారణమైన పోలీసులు, విద్యాశాఖ అధికారులపై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్ అ యింది. నెల రోజుల్లో ప్రభుత్వానికి తమ ని వేదిక ఇస్తామని కమిషన్ వెల్లడించింది. అధికారులు ఇకనైనా కాలయాపన చేయకుండా, కమిషన్ ఆదేశాలను పాటించి, మృతి వెనుక ఉన్న వాస్తవాలను, దోషులను వెలికితీసి, వివేక్ కుటుంబానికి న్యాయం చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతకుముందు నిర్లక్ష్యానికి బాధ్యులైన సి బ్బందిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ కేసులో మరింత పెద్ద కుంభకోణం దాగి ఉందనే అనుమానాలు బలపడతాయి.
ఆరుగురికి గురుకులాల సెక్రటరీ షోకాజ్
ఈ విషయంపై పాఠశాల ప్రిన్సిపాల్ శ్యా మలతతో విజయక్రాంతి’ మాట్లాడింది. జా తీయ ఎస్సీ కమిషన్ విచారణకు ముందే తనతోపాటు ఆరుగురు ఉపాధ్యాయులకు గురుకులాల సెక్రటరీ షోకాజ్ నోటీసులు జారీ చేశారని చెప్పారు. జిల్లా ఉన్నతాధికారుల విచారణ కొనసాగుతోందన్నారు. వి ద్యార్థి మరణించిన రోజు నుంచి కొందరు ఉపాధ్యాయులు పాఠశాలకు ఎందుకు రావడంలేదని మృతుడి తల్లిదండ్రుల ప్రశ్నలు ముందుంచగా, అలాంటిదేంలేదని, అంతకు ముందు రోజునుంచే అనీల్ అనే ఉపాధ్యాయుడు వ్యక్తిగత కారణాలతో సెలవులో ఉన్నారని చెప్పారు.