26-01-2026 12:09:55 AM
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 25 ,(విజయక్రాంతి): కేంద్ర బొగ్గు గనుల శాఖా మంత్రి కిషన్ రెడ్డి కొత్తగూడెం పర్యటన సందర్భంగా, ఇల్లందు గెస్ట్ హౌస్లో కొత్తగూడెం ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆయనను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ మనుగడ, కార్మికుల సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలతో కూడిన మెమోరాండంను మంత్రికి అందజేశారు.
అనంతరం విలేకర్లతో మాట్లాడిన కూనంనేని, సింగరేణి ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెంచేందుకు పెనగడప, పూనుకుడుచెలక, రాంపూర్, గుండాలలో తక్షణమే కొత్త భూగర్భ బొగ్గు గనులను ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. కార్మికుల సొంతింటి కలను సాకారం చేసేందుకు రూ. 30 లక్షల వడ్డీ లేని గృహ రుణాలను అందించాలని, అలాగే పదవీ విరమణ చేసిన వారికి కనీస పెన్షన్ రూ. 10 వేలకు తగ్గకుండా చూడాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
పాత సింగరేణి క్వార్టర్లను కూల్చివేయకుండా, ప్రస్తుతం నివసిస్తున్న మాజీ కార్మికులకే వాటిని కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు కార్మికుల కార్పొరేట్ మెడికల్ బోర్డును ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా కొనసాగించాలని కోరారు. సింగరేణి సంస్థను లాభాల బాటలో నడిపిస్తూనే, కార్మికుల న్యాయమైన హక్కులను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని కూనంనేని స్పష్టం చేశారు. ఈ అంశాలపై సానుకూలంగా స్పందించాలని మంత్రికి విన్నవించినట్లు ఆయన పేర్కొన్నారు. కూనంనేని వెంట సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, నాయకులు నెరేళ్ల రమేష్, పి.సత్యనారాయణ చారి, వున్నారు.