calender_icon.png 10 November, 2025 | 6:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎప్‌సెట్ ఫలితాలు విడుదల

19-05-2024 12:58:24 AM

మొదటి రెండు ర్యాంకుల్లో ఏపీ విద్యార్థులే

ఇంజినీరింగ్‌లో గతేడాది కన్నా తగ్గిన ఉత్తీర్ణత శాతం

త్వరలో అడ్మిషన్ షెడ్యూల్ విడుదల: బుర్రా వెంకటేశం

హైదరాబాద్, మే 18 (విజయక్రాంతి): టీఎస్ ఎప్‌సెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ) ఫలితాలు విడుదలయ్యా యి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ స్ట్రీమ్ లో తొలి రెండు ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులే ఉన్నారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని జేఎన్టీయూ యూనివర్సిటీలో ఎప్‌సెట్ ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి శనివారం ఉదయం విడుదల చేశారు.

ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో ఫస్ట్ ర్యాంకును ఏపీకి చెందిన ఎస్ జ్యోతిరాదిత్య, గొల్లలేఖ హర్ష రెండో ర్యాంకును, తెలంగాణకు చెందిన రిషి శేఖర్ శుక్లాకు మూడో ర్యాంకు దక్కింది. అదేవిధంగా అగ్రికల్చర్ ఫార్మసీ స్ట్రీమ్‌లో ఏపీకి చెందిన అలూర్ ప్రణీతకు మొదటి ర్యాంకు, నగుడసరి రాధాకృష్ణకు రెండో ర్యాంకు, తెలం గాణకు చెందిన గడ్డం శ్రీవర్షిణికి మూడో ర్యాంకు దక్కింది. 

తెలంగాణకు 5, ఏపీకు 5 ర్యాంకులు...

తెలంగాణ ఎప్‌సెట్ ఫలితాల్లో కొంతకాలంగా ఏపీకి చెందిన విద్యార్థులే టాపర్లుగా నిలుస్తున్నారు. అత్యధిక ర్యాంకులు కూడా వారే కైవసం చేసుకుంటున్నారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ స్ట్రీమ్‌లో టాప్ 10 ర్యాంకుల్లో 5 ర్యాంకులు ఏపీ విద్యార్థులకు దక్కగా, మరో 5 ర్యాంకులు తెలం గాణకు చెందిన విద్యార్థులకు దక్కాయి. ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లోని టాప్ 10 ర్యాంకుల్లో తొలి తొమ్మిది ర్యాంకులు అబ్బాయిలు సాధించారు. పదో ర్యాంకును అమ్మాయి కైవసం చేసుకుంది. అగ్రికల్చర్ ఫార్మసీలో ఒకటో ర్యాంకు, మూడో ర్యాంకు, పదో ర్యాంకులను అమ్మాయిలు సాధించగా, మిగతా ర్యాంకులను అబ్బాయిలు కైవసం చేసుకున్నారు.

అమ్మాయిలదే హవా...

ఎప్‌సెట్ ఫలితాల్లో అమ్మాయిలు పైచేయి సాధించారు. ఇంజినీరింగ్ పరీక్షను 2,40,618 మంది రాయగా 1,80,424 (74.98 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో అమ్మాయిలు 75.85 శాతం, అబ్బాయిలు 74.38 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక అగ్రికల్చర్ ఫార్మసీ విభాగంలో 91,633 మంది పరీక్ష రాయగా 82,163 (89.66 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో అమ్మాయిలు 90.18 శాతం, అబ్బాయిలు 88.25 శాతం ఉత్తీర్ణులయ్యారు.

ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి చెందిన అభ్యర్థులు మొత్తం ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణ నుంచి అగ్రికల్చర్ ఫార్మసీ విభాగానికి 18,834 మంది అబ్బాయిలు అర్హత సాధిస్తే, అమ్మాయిలు మాత్రం 53,732 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో మూడేళ్లుగా ఉత్తీర్ణత శాతం తగ్గుతోంది. 2024లో ఇంజినీరింగ్‌లో 74.98 శాతం ఉత్తీర్ణత సాధిస్తే, 2023లో 80.33 శాతం, 2022లో 80.41 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అగ్రికల్చర్ ఫార్మసీ విభాగంలో 2024లో 89.66 శాతం, 2023లో 86.31 శాతం, 2022లో 88.34 శాతం నమోదైంది.

ఆన్‌లైన్ ద్వారా బీకేటగిరీ భర్తీ...

అడ్మిషన్ షెడ్యూల్‌కు ముందే ప్రవేశాలు చేపడుతున్న ఇంజినీరింగ్ కాలేజీలపై చర్యలు తీసుకుంటామని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. బీకేటగిరీ (మేనేజ్‌మెంట్ కోటా) సీట్లను నీట్ తరహాలో ఆన్‌లైన్‌లో భర్తీ చేసేదుకు చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఫిజికల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ లేకుండా ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామన్నారు.

చర్యలు తప్పవు...

రాష్ట్రంలో ప్రైవేట్ వర్శిటీల ఏర్పాటుకు ఎటువంటి దరఖాస్తులు ఇంతవరకూ రాలేదని బుర్రా వెంకటేశం చెప్పారు. ఏర్పాటు చేసేందుకు వస్తే వారిని ఆహ్వానిస్తామన్నారు. అయితే వ్యాపార దృక్పథంలో ప్రైవేట్ యూనివర్శిటీలను ఏర్పాటు చేసి, తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే కుదరద న్నారు. ఉన్నత విద్యా ప్రమాణాలను పాటిం చే వర్శిటీలకు ఆహ్వానిస్తామన్నారు. ప్రైవేట్ వర్శిటీల ఏర్పాటుకు క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకొని, ఆ తర్వాత చట్టం చేయాల్సి ఉం టుందని ఆయన తెలిపారు. నిబంధనలు పాటించని గురునానక్, శ్రీనిధి వర్శిటీలపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని ఆర్ లింబాద్రి చెప్పారు. విద్యా సంవత్సరం నష్టపోకుండా ఆ యూనివర్శిటీల్ల్లోని విద్యార్థులను ఇతర కళాశాలల్లో అడ్మి షన్లు కల్పించినట్లు ఆయన తెలిపారు.

వారంలో అడ్మిషన్ షెడ్యూల్:

బుర్రా వెంకటేశం, 

విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి

ఫలితాలు చూసి విద్యార్థులు ఆం దోళన చెందవద్దని వెంకటేశం పేర్కొన్నారు. త్వరలోనే అడ్మిషన్ షెడ్యూల్ ఇస్తామన్నారు. జూన్ 2 కంటే ముం దే ఫలితాలను విడుదల చేస్తున్న నేపథ్యంలో ఏపీ విద్యార్థులు సైతం ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చని ఆయ న చెప్పారు. ఏపీ కంటే కూడా మన దగ్గర ఎప్‌సెట్ ఫలితాలను త్వరగా విడుదల చేశామని పేర్కొన్నారు. కళాశాలల అఫిలియేషన్ ప్రక్రియ నిరంతర ప్రాసెస్ అని, అడ్మిషన్ల ప్రారంభానికి ముందే అనుబంధ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. ఇంజినీరింగ్‌లో సీట్ల కొరత ఎక్కడా లేదని అన్నారు. అయితే సీఎస్‌ఈ (కంప్యూటర్ సైన్స్ ఇంనీరింగ్), అనుబంధ సీట్లే కావాలంటే ఎలా అన్నారు. సీఎస్‌ఈ కోర్సులను పెంచుతూ పోతే ఆ తర్వాత ఇతర కోర్సులకు డిమాండ్ తగ్గిపోతుందన్నారు.

ఇంజినీరింగ్‌లో 

టాప్ ర్యాంకర్లు వీరే

1-ఎస్ జోత్యిరాదిత్య-ఏపీ

2-గొల్లలేఖ హర్ష-ఏపీ

3-రిషిశేఖర్ శుక్లా-తెలంగాణ

4-బీ సందేశ్-తెలంగాణ

5-ఎం సాయి యశ్వంత్‌రెడి-ఏపీ

6-పుట్టి కుశల్‌కుమార్-ఏపీ

7-హుండికర్ విధీత్-తెలంగాణ

8-రోహన్ సాయి పబ్బా-తెలంగాణ

9-కొంతం మణి తేజ-తెలంగాణ

10-ధనుకొండ శ్రీనిథి-ఏపీ

అగ్రికల్చర్ ఫార్మసీలో 

టాప్ ర్యాంకర్లు వీరే

1-అలూర్ ప్రణీత-ఏపీ

2-ఎన్ రాధాకృష్ణ-ఏపీ

3-గడ్డం శ్రీవర్షిణి-తెలంగాణ

4-సోంపల్లి సాకేత్ రాఘవ్-ఏపీ

5-రేపాల సాయి వివేక్-తెలంగాణ

6-మహమ్మద్ అజాన్‌సాద్-తెలంగాణ

7-వడ్లపూడి ముకేశ్ చౌదరి-ఏపీ

8-జే భార్గవ్ సుమంత్-తెలంగాణ

9-జయశెట్టి ఆదిత్య-తెలంగాణ

10-పూల దివ్యతేజ-ఏపీ