25-05-2025 12:00:00 AM
కాస్త ఆరోగ్యం బాగోపోతే చాలు.. మనకు వెంటనే గుర్తొచ్చేది ట్యాబ్లెట్. ట్యాబ్లెట్లను ఉదయం పరిగడుపున, టిఫిన్ చేశాక, మధ్యాహ్నం, రాత్రి.. ఇలా డాక్టర్ చెప్పిన సమయానికి వేసుకుంటాం. అయితే కొన్ని ట్యాబ్లెట్లను పరిగడుపునే ఎందుకు వేసుకోమంటారు?
మరికొన్నింటిని ఏదైనా తిన్నాకే ఎందుకు వేసుకోమంటారు? అనే సందేహం మనలో చాలామందికి వచ్చే ఉంటుంది. అలాగే ట్యాబ్లెట్ వేసుకున్నా ఏవి తినకూడదు? ఏవి తినాలి? ఇలా అనేక సందేహాలకు సమాధానాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..
ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు క్రమం తప్పకుండా మందులు వేసుకోవడం మాత్రమే కాదు ఎలా వేసుకుంటున్నామన్నది కూడా చాలా ముఖ్యం. అదేనండీ పరిగడుపున వేసుకోవాల్సినవి, భోజనానికి ముందు, భోజనం తర్వాత తీసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ విషయంలో డాక్టర్ సూచనలు తప్పకుండా పాటిస్తేనే అవి సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇక ఉదయాన్నే ఖాళీ కడుపుతోమందు తీసుకుంటే అది వేగంగా కరిగి రక్తంలోకి చేరుతుంది.
భోజనం చేశాక మాత్రలు వేసుకుంటే ఆహారంలోని కొవ్వులు, ఫైబర్‌లు మాత్రలతో కలిసిపోయి మందు సరిగ్గా పనిచేయదు. ఆహారంలో కలిసిపోవడం వల్ల మాత్రల సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. ఖాళీ కడుపుతో తీసుకునే మాత్రల ప్రభావం వెంటనే కన్పిస్తుంది.
కొన్ని రకాల మందులు ఆహారంతో కలిస్తే కడుపులో చికాకు ఏర్పడుతుంది. అందుకే ఖాళీ కడుపున తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. ఏ మందును ఖాళీ కడుపుతో వేసుకోవాలో, ఏ మందును ఆహారం తిన్నాక తీసుకోవాలో డాక్టర్ లేదా ఫార్మాసిస్ట్‌ను అడగండి. మందులను తీసుకునేటప్పుడు డాక్టర్ సూచనలు పాటించడం చాలా ముఖ్యం.
ఎందుకు వేసుకోవాలి?
ఆహారం తిన్నాకే మందులు ఎందుకు తీసుకోవాలంటే.. కొన్ని రకాల ఔషధాలను భోజనం చేశాక తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. వాటిని ఖాళీ కడుపుతో తీసుకుంటే కడుపులో చిరాకు, వాంతులు, విరేచనాలతో పాటు జీర్ణకోశ సమస్యలు ఎదురవుతాయి. ఉదాహరణకు ఐరన్ మాత్రలు తినకుండా వేసుకుంటే వాంతులు వస్తాయి. అందుకే డాక్టర్లు చెప్పినట్లు తిన్నాక వేసుకోవాల్సిన మాత్రలను ఏదైనా తీసుకున్నాకే వేసుకోవాలి.
తీనకూడనివి?
ద్రాక్ష: కొన్ని ఆహార పదార్థాలు కొన్ని మందుల ప్రభావాన్ని ప్రభావితం చేస్తాయి. కొన్నిసార్లు దుష్ప్రభావాలకూ కారణమవుతాయి. ద్రాక్ష పండ్లు లేదా ద్రాక్ష జ్యూస్ తీసుకున్న వెంటనే మందులు వేసుకోవడం మంచిది కాదు. రక్తపోటుకు సంబంధించిన, యాంటీ యాంగ్జుటై, కొలెస్ట్రాల్ తగ్గించే మందుల పనితీరుపై ఇది ప్రభావితం చూపుతుంది.
పాల ఉత్పత్తులు: పాల ఉత్పత్తులు కూడా మాత్రలు జీర్ణం కావడానికి ఆటంకం కలిగిస్తాయి. టెట్రాసైక్లిన్, డాక్సీసైక్లిన్ వంటి కొన్ని యాంటీబయాటిక్స్ మందులు తీసుకున్న రెండు గంటలలోపు పాల ఉత్పత్తులను తీసుకోకపోవడం ఉత్తమం.
ఫైబర్ ఆహారాలు: తృణధాన్యాలు, చిక్కుళ్లు, పచ్చిపండ్లు వంటి అధిక ఫైబర్ ఆహారాలు.. థైరాయిడ్ మెడిసిన్, కొన్ని యాంటి డిప్రెసెంట్స్‌తో సహా కొన్ని మందుల జీర్ణం కావడానికి ఆటంకం కలిగిస్తాయి.
కొవ్వు పదార్థాలు: మాంసాహారం వంటి కొవ్వు పదార్థాలు కొన్ని ఔషధాల పనితీరును నెమ్మదింపజేస్తాయి. వాటి ప్రభావాన్ని తగ్గిస్తాయి.
ఆల్కహాల్: నొప్పి నివారణ, మత్తుమందులు, కొన్ని యాంటీ బయాటిక్స్‌తో సహా అనేక మందులు తీసుకోవాల్సి ఉన్నప్పుడు ఆల్కహాల్ తీసుకోకపోవడం మంచిది. మద్యం తాగిన తర్వాత మాత్రలు వేసుకుంటే కాలేయం దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
కెఫిన్: కెఫిన్‌తో కూడిన పదార్థాలు ఔషధాల పనితీరును ప్రభావితం చేస్తాయి.