17-09-2025 12:35:29 AM
మేడ్చల్, సెప్టెంబర్ 16 (విజయ క్రాంతి): మేడ్చల్ పట్టణంలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నప్పటికీ చర్యలు తీసుకోకపోవడంపై టౌన్ ప్లానింగ్ అధికారి రాధాకృష్ణారెడ్డి తో బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ముల్లంగిరి శ్రీహరి చారి, బిజెపి నాయకులు పాతూరి సుధాకర్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. మంగళవారం టి పి ఓ ను కలిసి గతంలో తాము ఇచ్చిన ఫిర్యాదులపై ఏమి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.
తమ ఫిర్యాదులపై నెలల తరబడి చర్యలు తీసుకోకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పెద్ద వాణిజ్య సంస్థలు, భవనాలు మున్సిపల్ అనుమతి లేకుండా నిర్మిస్తున్నారన్నారు. పిస్తా హౌస్, ఐటిఐ ఎదురుగా సంతోష్ ధాబా, లైవ్ కిచెన్‌లకు అనుమతి లేదన్నారు.
కేఎల్‌ఆర్ కాలనీలో కమాన్ దగ్గర రెండంతస్తులకు అనుమతి తీసుకొని అదనంగా మరికొన్ని అంతస్తులు నిర్మిస్తున్నారన్నారు. కేఎల్‌ఆర్ లో ఒక్క భవనాన్ని కూడా అనుమతులకు అనుగుణంగా నిర్మించడం లేదన్నారు. అక్రమ నిర్మాణాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని వారు స్పష్టం చేశారు.