calender_icon.png 17 September, 2025 | 3:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెప్టెంబర్ 17పై పార్టీకో విధానం

17-09-2025 01:42:56 AM

  1. పబ్లిక్ గార్డెన్‌లో ప్రజాపాలన దినోత్సవం 
  2. హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి 
  3. పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ విమోచన దినోత్సవం 
  4. హాజరుకానున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ 
  5. కాంగ్రెస్, కమ్యునిష్టు పార్టీల ఆధ్వర్యంలో విలీన దినోత్సవం

హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): నిజాం సర్కార్ నుంచి తెలంగాణ సంస్థానం భారతదేశంలో విలీనమైన సెప్టెంబర్ 17 రోజును ఒక్కో పార్టీ ఒక్కో విధంగా నిర్వహిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవం పేరుతో పబ్లిక్‌గార్డెన్‌లో కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, సీఎం రేవంత్‌రెడ్డి హాజరై జాతీయ జెండాను ఆవిష్క రించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో విలీన దినోత్సం పేరుతో కార్యక్రమం నిర్వహిస్తూనే జిల్లా కేంద్రాల్లోనూ ఉత్సవాలు చేయనున్నారు.

బీజేపీ ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచనం దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హాజరుకానున్నారు. నిజాం నవాబుకు వ్యతిరేకంగా  సాయుధపోరాటం నిర్వహించిన కమ్యునిస్టు పార్టీలు విలీన దినోత్సవంగానే జరుపుకుంటున్నాయి.

కాగా నిజాం నుంచి తెలంగా ణకు అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లాబాయ్ పటేల్ వల్లే విముక్తి కలిగిందని బీజేపీ విస్తృత ప్రచారం చేస్తున్నది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. అప్పటి ప్రధాని నెహ్రూ ఆదేశాల మేరకే పటేల్ నిజాం సర్కార్‌పై సైనిక చర్యలకు ఉపక్రమించారని, ఈ విషయంలో నెహ్రూను పక్కన పెట్టడం సరికాదని చెపుతున్నారు. 

రాజ్‌నాథ్‌సింగ్‌కు స్వాగతం పలికిన బీజేపీ నేతలు

బుధవారం పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే తెలంగాణ విమోచన దినో త్సవానికి హాజరయ్యేందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మంగళవారం సాయంత్రం బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, ఎంపీలు లక్ష్మణ్, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రఘునందన్‌రావు, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, కొమురయ్య, కలెక్టర్ హరిచందన స్వాగతం పలికారు.