calender_icon.png 17 September, 2025 | 3:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీఎస్టీ సవరణతో 5 వేలకోట్ల నష్టం

17-09-2025 01:20:18 AM

  1. అయినా పేదల సంక్షేమం కోసం వెనకడుగేయం
  2. జీఎస్టీ రేట్ల తగ్గింపులో ప్రముఖపాత్ర పోషించా 
  3. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు వెల్లడి 

హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): జీఎస్టీ రేట్ల సవరణతో రాష్ర్ట ప్రభుత్వ ఆదాయానికి ఏటా రూ.5 వేల కోట్ల గండి పడుతుందని.. అయినా పేద, మధ్యతరగతి, రైతు కుటుంబాల సంక్షేమం కోసం జీఎస్టీ రేషనలైజేషన్ జరగాలని సీఎం రేవంత్ రెడ్డి, క్యాబినెట్ విధానపరమైన నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సామాన్యులు, మధ్యతరగతి ప్రజల ఎదుగుదల కోసమే ప్రజా ప్రభుత్వం జీఎస్టీ రేట్ల సవరణ విధాన నిర్ణయంలో కీలక భూమిక పోషించిందని తెలిపారు.

జీఎస్టీ రేట్ల సవరణ నేపథ్యంలో వ్యాపార వర్గాలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మంగళవారం ఎంసీహెచ్‌ఆర్‌డీలో కమర్షియల్ టాక్స్ విభాగం ఆధ్వర్యంలోఇంట్రాక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ జీఎస్టీ కౌన్సిల్ సభ్యుడిగా ప్రజల సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకోవడంలో తాను ప్రముఖపాత్ర వహించినట్టు చెప్పారు.

సవరించిన రేట్లతో పెద్ద సంఖ్యలో వస్తువులు తక్కువ ధరలకు అందుబాటులోకి వస్తున్నాయని, ఆ ఫలాలను ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం, వ్యాపారులపై ఉందన్నారు. జీఎస్టీలో సులభమైన విధానాన్ని తెచ్చేందుకు ఢిల్లీలో సుదీర్ఘ చర్చలు జరిగాయి.. భేషజాలకు పోకుండా కేంద్ర నిర్ణయాలు రాష్ర్ట ప్రజలకు ఉపయోగపడతాయని తాను భావిస్తున్నట్టు డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.

ప్రభుత్వం, వ్యాపారులు కలిసి నడిస్తేనే ప్రగతి సాధ్యమవుందని, వ్యాపారులు మనసు కష్ట పెట్టుకోకుండా రేట్ల సవరణ ద్వారా తగ్గిన వస్తువుల ధరల వాస్తవాలను ప్రజలకు తెలియచెప్పాలన్నారు. జీఎస్టీ రేట్ల రేషనలైజేషన్ తర్వాత, అంతకుముందు వివిధ వస్తువుల ధరలు ఏ విధంగా మార్పు జరిగిందో వ్యాపారులు తమ దుకాణాల ముందు సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా ప్రదర్శించాలన్నారు.

జీఎస్టీ రేట్ల సవరణతో వ్యవసాయ రంగానికి అవసరమైన పరికరాల ధరలు, ఆహార ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గుతాయన్నారు. సిమెంట్ జీఎస్టీ స్లాబ్ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు, ఫలితంగా సిమెంటు ధరలు తగ్గుతాయని, దీంతో నిర్మాణ రంగం భారీగా పుంజుకొనే అవకాశం ఉందన్నారు.

ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ వాస్తవంగా వ్యాపారం చేసే వారికి ఉపయోగకరమన్నారు. అడ్డదారులు తొక్కే వారి వల్ల రాష్ర్ట ఆదాయానికి నష్టం చేకూరుతుందని, నిబద్ధతతో స్వచ్ఛంగా వ్యాపారం చేసేవారు అడ్డదారులు తొక్కే వ్యాపారుల సమాచారాన్ని రాష్ర్ట ప్రభుత్వానికి అందించాలని డిప్యూటీ సూచించారు.

వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులున్నా చర్చించేందుకు ప్రభుత్వ ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయని భరోసానిచ్చారు. బీమా, డెయిరీ, ఎలక్ట్రానిక్స్  రంగాలకు చెందిన వ్యాపారుల అభిప్రాయాలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని చెప్పారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, కమర్షియల్ టాక్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రిజ్వీ, కమిషనర్ హరిత తదితరులు పాల్గొన్నారు.