17-09-2025 02:35:38 AM
రెండు రోజులుగా గాలిస్తున్నా ఫలించని ప్రయత్నం
ముషీరాబాద్‌లో లభ్యమైన సన్నీ బైక్
హైదరాబాద్, సిటీ బ్యూరో, సెప్టెంబర్ 16(విజయక్రాంతి)/ముషీరాబాద్: నగరంలో ఆదివారం కురిసిన కుండపోత వర్షా నికి నాలాల్లో కొట్టుకుపోయి గల్లంతైన ము గ్గురి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. రెండు రోజులుగా అవిశ్రాంతంగా శ్రమిస్తున్నప్పటికీ వారి జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యుల ఆశలు ఆవిరవుతున్నాయి. గాలింపు చర్యలను మంగళవారం మరింత ఉద్ధృతం చేసిన అధికారులు, మూసీ నదిపై దృష్టి సారించారు.
అత్యాధునిక డ్రోన్ల సహాయం తో నదీ పరివాహక ప్రాంతాన్ని జల్లెడ పట్టి నా ప్రయోజనం లేకపోయింది.ముషీరాబాద్ వినోభా కాలనీలో నాలాలో కొట్టుకు పోయిన దినేష్ అలియాస్ సన్నీకి చెందిన ద్విచక్రవాహనాన్ని, దుర్ఘటన జరిగిన ప్రాం తానికి 150 మీటర్ల దూరంలో సిబ్బంది గుర్తించి మంగళవారం వెలికితీశారు. బైక్ లభించిన చోటు నుంచి ఘటనా స్థలం వరకు ఉన్న ప్రతి క్యాచ్పిట్ను తెరిచి, డీఆర్‌ఎఫ్ సిబ్బంది ప్రాణాలకు తెగించి భూగర్భ డ్రైనేజీలోకి వెళ్లి గాలించారు.
అత్యంత ప్రమాదకరమైనప్పటికీ, వారు సాహసోపేతంగా గాలించినా సన్నీ ఆచూకీ మాత్రం లభించలేదు. మరోవైపు, ఆసిఫ్‌నగర్‌లోని అఫ్జల్ సాగర్ నాలాలో గల్లంతైన అర్జున్, రాముల కోసం కూడా గాలింపు కొనసాగుతూనే ఉంది. నాలాల్లో వారి జాడ లభించకపోవడంతో, వారు మూసీ నదిలోకి కొట్టుకు పోయి ఉండవచ్చని అధికారులు భావించారు.
ఈ క్రమంలో మంగళవారం డ్రోన్ల సహాయంతో మూసీ నదిలో గాలించినా ఫలితం దక్కలేదని సెర్చ్ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్న అదనపు సంచాలకులు వర్ల పాపయ్య తెలిపారు. హైడ్రా అధికారులు జయప్రకాష్, గౌతమ్, యజ్జనారాయణల ఆధ్వర్యంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.