17-09-2025 01:18:13 AM
తెలంగాణ నెత్తుటి చరిత్రకు సజీవ సాక్ష్యం
సిద్దిపేట, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): తెలంగాణ చరిత్రలోనే సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలోని బైరాన్‌పల్లికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 1948లో తెలంగాణ విమోచన పోరాటంలో ఈ చిన్న గ్రామం రాజాకర్లకు ఎదురొడ్డి నిలిచి ధైర్యాన్ని, త్యాగాన్ని ప్రదర్శించింది. స్వేచ్ఛ కోసం పోరాడిన గ్రామస్తులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయలేదు. 1948, సెప్టెంబర్ 17న రాజాకర్లు బైరాన్‌పల్లిపై దాడి చేశారు. ఆ హింసాత్మక దాడిలో గ్రామస్తులు వెనుకడుగు వేయకుండా ప్రతిఘటించారు.
ఈ పోరులో 15 మంది గ్రామస్తులు అమరులయ్యారు. వారి రక్తసిక్త బలిదా నం తెలంగాణ విమోచన చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించింది. ఈ ఘటనతో బైరాన్‌పల్లి ‘అమర వీరుల పల్లె’గా చిరస్థాయిలో నిలిచింది. బైరాన్‌పల్లి వీరుల త్యాగం తెలంగాణ విమోచనానికి మరింత బలాన్ని ఇచ్చింది. వారి ధైర్యం అనేక గ్రామాల ప్రజలకు స్ఫూర్తి కలిగించింది. స్వేచ్ఛ కోసం పోరాడటానికి వెనుకాడని సాధారణ రైతులు, కార్మికులు చేసిన ఈ త్యాగమే ఉద్యమానికి ప్రాణం పోసింది. చివరికి తెలంగాణ విమోచనం సాధ్యమైంది.
తరతరాలకు మార్గదర్శకం
ప్రతీ సంవత్సరం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బైరాన్‌పల్లి గ్రామంలో శ్రద్ధాంజలి సభలు జరుగుతాయి. అమరుల స్మా రక స్థూపం వద్ద నివాళులు అర్పిస్తూ పోరాట యోధులను స్మరించుకుంటారు. బైరాన్‌పల్లి ఘటన తెలంగాణ చరిత్రలో ఒక శాశ్వత గాథ. ఈ గ్రామం పేరు వినగానే త్యాగం, వీరత్వం, స్వేచ్ఛాస్ఫూర్తి గుర్తుకొస్తాయి. బైరాన్‌పల్లి అమరుల త్యాగమే ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛకు పునాది. రాజాకార్ల బానిసత్వానికి వ్యతిరేకంగా వారు ప్రాణాలు అర్పించకపోతే, తెలంగాణ విమోచనం ఇంత త్వరగా సాధ్యమయ్యేది కాదు.