calender_icon.png 17 September, 2025 | 3:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రగ్స్ కేసుల్లో చిక్కిన విదేశీయుల బహిష్కరణ

17-09-2025 01:05:05 AM

  1. సన్నాహాల్లో కేంద్ర హోం మంత్రిత్వశాఖ 
  2. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నిర్బంధంలో 16 వేల మంది
  3. ఇమ్మిగ్రేషన్, ఫారినర్స్ యాక్ట్-- 2025 ప్రకారం చర్యలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: దేశవ్యాప్తంగా సుమారు 16,000 మంది విదేశీయులను బహిష్కరించేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ సిద్ధమవుతున్నది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అదుపులో ఉన్న ఈ విదేశీయులు భారతదేశ వ్యాప్తంగా డ్రగ్స్ రవాణా, విక్రయాలతోపాటు ఇతర నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వారంతా నిర్బంధ కేంద్రాల్లో ఉన్నారు.

వీరిలో బంగ్లాదేశ్, పిలిప్పీన్స్, మయన్మార్, మలేషియా, ఘనా, నైజీరియాకు చెందిన వారే ఎక్కువ మంది ఉన్నారు. ‘ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్-- 2025’ ప్రకారం.. వారు దేశ భద్రతకు ముప్పు తీసుకొచ్చే అవకాశం ఉన్నందున వారిపై చర్యలకు కేంద్ర హోంశాఖ ఉపక్రమించింది. దేశంలో అక్రమ వలసలను కట్టడి చేసేందుకు, నకిలీ పత్రాలతో భారత్‌లోకి ప్రవేశించేవారికి చెక్ పెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం పాత నాలుగు చట్టాల స్థానంలో ఒకేఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది.

ఈ చట్టం ఏప్రిల్ 4న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం పొంది, సెప్టెంబర్ 2వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. కొత్త చట్టం ప్రకారం నేరాలకు విదేశీయులకు కఠిన శిక్షలు ఉంటాయి. నేర తీవ్రతను బట్టి న్యాయస్థానాలు నిందితులకు రెండేళ్ల నుంచి గరిష్ఠంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష  విధిస్తాయి. అంతేకాదు.. రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. 

అక్రమ వలసల కట్టడికి..

భారత్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగినా, దేశంలో కోట్ల మంది ప్రజలు ఇంకా పేదరికంలో జీవిస్తున్నారు. ఈ పరిస్థితికి భారత్‌లోకి అక్రమ వలసలూ ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సరిహద్దు దేశాల నుంచి అక్రమంగా ప్రవేశించిన విదేశీయులు భారత్‌లో ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందుతూ, అర్హులైన భారత పౌరులకు నష్టం కలిగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే, కేంద్ర ప్రభుత్వం అక్రమ వలసదారుల సమస్యను సమూలంగా పరిష్కరించేందుకు కొత్త చట్టాన్ని కఠినంగా అమలు చేయనుంది. డ్రగ్స్ రవాణా, విక్రయాల వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన విదేశీయులను వెంటనే దేశం నుంచి బహిష్కరిస్తే, దేశంలో నేరాల రేటును తగ్గించడంతో పాటు, భద్రతను పటిష్టం చేయవచ్చని కేంద్ర హోంశాఖ భావించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది.