calender_icon.png 17 September, 2025 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కదనరంగంలో కామారెడ్డి

17-09-2025 01:12:25 AM

  1. రజాకర్లకు చుక్కలు చూపిన పోరాటయోధులు 
  2. నిజాం ఆగడాలపై ఉక్కుపాదం 
  3. ఆపరేషన్ పోలోలో మిలటరీకి సహకారం

సెప్టెంబర్ 17 తెలంగాణ స్వాతంత్య్రం!

కామారెడ్డి/ ఆసిఫాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): నిజాం నిరంకుశ పాలనను కూలదోయడానికి సాగిన సాయుధ పోరాటంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కామారెడ్డికి చెందిన సమరయోధుల పాత్ర అమోఘమైంది. నిజాం ఆగడాలను ధైర్యంగా ఎదుర్కొంటూనే, భారతదేశంలో హైదరాబాద్ విలీనానికి కేంద్రం చేపట్టిన ఆపరేషన్ పోలోకు సైతం బాసటగా నిలిచారు. ఆనాటి పోరాట దృశ్యాలు నేటికీ చారిత్రాత్మక సాక్ష్యాలుగా నిలుస్తాయి.

కామారెడ్డి ప్రాంతంలోని తలమడ్ల, మద్దికుంట, రెడ్డిపేట తదితర ప్రాంతాలకు చెందినవారు సదాశివనగర్ మండలం కుప్రియాల్‌కు చెందిన గోపాల్‌రెడ్డి నాయకత్వంలో ఉద్యమించారు. రజాకార్ల ఆగడాలను ఎదిరించేందుకు, అడవుల గుండా కాలినడకన గ్రామాలకు వెళ్లి ప్రజలను చైతన్యవంతం చేసేవారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన పనిహారం రంగాచారి నిజాం ఆగడాలపై నీలివర్ణ చిత్రాలు వేశారు. దీంతో రజాకర్లు ఆయన్ను చిత్రహింసలకు గురిచేశారు.

ఇక్కడి యువకులు అప్పటి మాచారెడ్డి మండలంలోని రెడ్డిపేట, అన్నారం, అక్కాపూర్, మద్దికుంట గ్రామాల్లో దళాలను ఏర్పాటు చేసుకొని రైస్ డిపోలను కొల్లగొట్టారు. చంద్రపూర్, బల్లార్షా దాబాలలో ప్రత్యేక మిలటరీ శిక్షణ శిబిరాల్లో సాయుధ శిక్షణ పొందారు. కుప్రియాల్ మంద గోపాల్ రెడ్డి దళాన్ని ఏర్పాటు చేసుకొని వారికి ఆయుధ శిక్షణ ఇచ్చారు. తాడ్వాయి మండలం ఎర్రపాడుకు చెందిన బొక్క లింగారెడ్డి, విఠల్ రెడ్డితో పాటు పలువురు సాయిధ పోరాటంలో పాల్గొన్నారు.

ఈ ప్రాంతంలో కొనసాగే ఉద్యమానికి కొండా లక్ష్మణ్ బాపూజీ వ్యూహాకర్తగా వ్యవహరించేవారు. జిల్లాలోని పిట్లం, రాజంపేట, తలమడ్ల, భిక్కనూరు, రామేశ్వర్ పల్లి, లక్ష్మిదేవునిపల్లి పలు ప్రాంతాలకు చెందిన వారు పోరాటం చేశారు. పలువురు యువకులు సాయుధ శిక్షణ పొంది.. భారత మిలటరీకి అండగా నిజాంపై తిరుగుబాటు చేశారు. వీరి స్ఫూర్తితో సామాన్య పౌరులు సైతం కదనరంగంలో దూకారు. 1947లో పైకాజీ అనే ఉద్యమకారుడిని హతమార్చేందుకు డిప్యూ టీ కలెక్టర్ సమక్షంలో హత్యాయత్నం కూడా జరిగింది. 

మందగోపాల్‌రెడ్డి నాయకత్వంలో..

1948, సెప్టెంబర్ 13న మిలటరీ యాక్షన్ ప్రకటించగా అదేరోజు పలువురు సాయిధ పోరాట యోధులు కుప్రియాల్‌కు చెందిన మంద గోపాల్‌రెడ్డి నాయకత్వంలో సైనిక దళాలు హైదరాబాద్ వైపు కదలాయి. మహారాష్ర్ట సరిహద్దున వర్దానది రైల్వే వంతెనకు నిజాం రజాకార్లు బాంబు అమర్చారు. పసిగట్టిన సైనికులు.. రజాకారులను హతమార్చి బాంబు తొలగించారు. సెప్టెం బర్ 14న- బల్లార్షా సమీపంలోని సాస్తి ప్రాంతంలో జరిగిన పోరాటంలో పదిమంది ఉద్యమకారులు మృతి చెందారు.

ఆసిఫాబా ద్‌కు చెందిన సమరయోధులు ఇదే రోజు వీరూర్ రైల్వే స్టేషన్‌ను ధ్వంసం చేశారు. 15న- మాణిక్ గూడ నిజాం పోలీస్ అవుట్ పోస్ట్‌పై ఉద్యమకారులు దాడి చేసి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆసిఫా బాద్-వాంకిడి మధ్య ఉన్న బుదల్‌ఘాట్ వంతెనను రజాకార్లు పేల్చివేశారు. సెప్టెంబర్ 16న- సిర్పూర్ నిజాం పోలీసుల ఔట్ పోస్టులు భారత సైన్యం స్వాధీనం చేసుకుంది.

దహేగాం మండలం పెసర్‌కుంట వద్ద నక్కిఉన్న 200 మంది రజాకార్లకు సైన్యానికి మధ్య భీకర పోరాటం జరిగింది. ఈ ఘటనలో 19 మంది ఉద్యమకారులు మరణించారు. పలువురు బీబ్రావాసులు గాయపడ్డారు. చివరకు బీబ్రా పోలీస్ స్టేషన్‌ను సైనికులు హస్తగతం చేసుకున్నారు. సెప్టెంబర్ 17న- నిజాం సర్కార్ భారత సైన్యానికి లొంగిపోయింది. దీంతో సెప్టెంబర్ 18న- నిజామాబాద్ ఉమ్మడి జిల్లా జైలు నుంచి సుమారు 800 మంది ఉద్యమ ఖైదీలు గేట్లు తెరుచుకొని స్వేచ్ఛ భారతంలోకి వచ్చారు.