calender_icon.png 17 September, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ వీరత్వం.. వెయ్యి ఉరుల మర్రి

17-09-2025 01:15:27 AM

  1. నిజాం నవాబు పాలిట సింహస్వప్నం రాంజీ గోండు
  2. స్వతంత్ర గోండు రాజ్యమే లక్ష్యంగా పోరాటం
  3. రాంజీగోండు సహా వెయ్యి మందిని ఉరితీసిన బ్రిటీషర్లు

నిర్మల్, సెప్టెంబర్ 16: స్వతంత్య్ర భారత చరిత్రలోనే కాక, ప్రపంచ చరిత్రలోనే ‘వెయ్యి ఉరుల మర్రి’ ఎంతో ప్రసిద్ధి గాంచింది. తమ హక్కుల కోసం ఉద్యమ ఆదివాసీ గోండు నాయకుడు రాంజీగోండు నాయకత్వంలో ఉద్యమిస్తున్న వెయ్యిమంది గోండులను అత్యంత కిరాతకంగా ఒకే చెట్టుకు ఉరితీశారు. తెలంగాణ జలియాన్ వాలాబాగ్‌గా ప్రసిద్ధిగాంచిన ఈ చారిత్రాత్మక ఘటనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ ప్రాంతం వేదికైంది.

1857 సిపాయిల తిరుగుబాటుకు ముందే నిర్మల్‌కేంద్రంగా గోండు వీరుడు మర్సకోల రాంజీగోండు తిరుగుబాటు ఉద్యమాన్ని చేపట్టి, బ్రిటిష్‌వారికి, నిజాంప్రభువుకు సింహస్వప్నంలా మారాడు. గోం డులపై బ్రిటీష్ ప్రభుత్వం ఆగడాలు అధికమవడం తో జల్.. జంగల్.. జమీన్ పేరుతో ఈ ప్రాంత హక్కు ల కోసం పోరాటం మొదలుపెడతాడు. ఆదివాసీల కు గెరిళ్లా యుద్ధవిద్యలో నిష్ణాతులుగా పోరా టం ఆరంభిస్తాడు. రాంజీని పట్టుకునేందుకు బ్రిటిష్ ప్రభుత్వం, నిజాం ప్రభువు సహకారంతో ఆదివాసీలను చిత్రహింసలకు గురిచే స్తారు.

కానీ అతడు పోరాటాన్ని కొనసాగించాడు. దీంతో రాంజీని హతమార్చాలని నిర్ణయం తీసుకుంటారు. ప్రభుత్వం కర్ణాటకనుంచి కల్నల్ రాబర్ట్‌ను పిలిపించి రాంజీని అంతమొందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తారు. కానీ అతడు వారికి చిక్కకుండా గెరిళ్లా పోరాటాలతో వారిని వీరోచితంగా ఎదుర్కొన్నాడు. చివరకు 1860, ఏప్రిల్ 9న రాంజీగోండు సోన్ ప్రాం తంలో ఉన్నట్టు తెలుసుకొని బంధిస్తారు. అతడితో పాటు వెయ్యి మంది పోరాటయోధులను నిర్బంధించి ఇనుప సంకేళ్లతో నిర్మల్ పట్టణంలోని కురన్నపేట వద్దకు తీసుకొస్తారు.

అక్కడే ఉన్న భారీ మర్రి చెట్టుకు వారిని ఉరితీస్తారు. అప్పటి నుంచి ఈ ప్రాంతం వెయ్యి ఉరుల మర్రిగా ప్రసిద్ధి చెందింది. 1995లో ఈ చెట్టు వడగాల్పుల ప్రభావంతో తీవ్రంగా ధ్వంసమైంది. పదేండ్ల క్రితం ఇక్కడ ప్రజాయుద్ధ నౌక గద్దర్ చేతుల మీదుగా స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ జలియాన్ వాలాబాగ్‌గా చరిత్రలో ప్రసిద్ధికెక్కిన ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రభుత్వాల చిన్నచూపు కొనసాగుతోందన్న ఆరోపణ ఉంది.