15-07-2025 12:13:11 AM
మహబూబాబాద్, జూలై 14 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ సెలవుల అనంతరం విధుల్లో చేరడానికి వెళ్తున్నానని చెప్పి, కారు, సెల్ఫోన్ నంద్యాల జిల్లా శ్రీశైలం డ్యాం వద్ద వదిలి పెట్టడంతో అతని జాడ కోసం కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. ఆర్మీ జవాన్ బంధువులు, గ్రామస్తుల కథనం ప్రకారం మరిపెడ మండలం గిరిపురం గ్రామ శివారు పూసల తండా కు చెందిన ఆర్మీ జవాన్ మూడ్ నవీన్ ఢిల్లీలో ఆర్మీ జవాన్ గా విధులు నిర్వహిస్తున్నాడు.
గత నెల 28న తన భార్య ఆపరేషన్ నిమిత్తం ఢిల్లీ నుండి స్వగ్రామానికి వచ్చి ఇటీవల హైదరాబాదులోని ఓ ఆస్పత్రిలో భార్యకు శస్త్ర చికిత్స చేయించాడు. ఈనెల 11న తిరిగి విధుల్లో చేరాల్సి ఉండగా, అదే రోజు కారులో శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లి అక్కడనుండి విమానంలో ఢిల్లీకి వెళ్లి విధుల్లో చేరి మళ్లీ సెలవులు తీసుకుని వస్తానని చెప్పి వెళ్లాడని సమాచారం.
అయితే ఆర్మీ జవాన్ నవీన్ శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లకుండా శ్రీశైలం వైపు వెళ్లడం, అక్కడ కారు, సెల్ఫోన్ వదిలివేయడం, కొందరు సన్నిహితులకు తను ఇక మీకు కనిపించను అంటూ మెసేజ్ పంపినట్లు ప్రచారం సాగుతోంది. దీనితో ఆర్మీ జవాన్ కుటుంబ సభ్యులు కారు వదిలిన ఘటనస్థలికి వెళ్లి అతని ఆచూకీ కోసం వెతుకుతున్నారు. ఈ సంఘటన తెలుసుకున్న అమ్రాబాద్ పోలీసులు శ్రీశైలం డ్యాం వద్ద నవీన్ కోసం ఆదివారం గాలింపు చర్యలు చేపట్టగా ఎలాంటి ఆచూకీ లభించలేదు. మరోసారి సోమవారం నవీన్ ఆచూకీ కోసం గాలిస్తామని పోలీసులు తెలిపినట్లు నవీన్ బంధువులు చెప్పారు. నాలుగు రోజులుగా ఆర్మీ జవాన్ కనిపించకుండా పోవడం, ఆచూకీ లభించకపోవడం మిస్టరీగా మారింది.