calender_icon.png 13 October, 2025 | 10:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు

13-10-2025 06:44:40 PM

అదనపు కలెక్టర్ (రెవిన్యూ) లక్ష్మీనారాయణ..

గద్వాల (విజయక్రాంతి): రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ (రెవిన్యూ) లక్ష్మీనారాయణ తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్ల గురించి సోమవారం హైదరాబాదు నుంచి కన్జ్యూమర్ అఫైర్స్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ స్టీఫెన్ రవీంద్ర అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా గద్వాల ఐడిఓసి వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఐకెపి తరఫున 70, పిఎసిఎస్ కు సంబంధించి 09, మెప్మా తరపున 05 మొత్తం 84 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 2.11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు అవసరమైన గన్ని సంచులు, తూకాలు, తేమ నిర్ధారణ యంత్రాలు, తదితర కొరత లేకుండా చూస్తామన్నారు. గతేడాది ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద వచ్చిన సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈ సీజన్లో తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ, మండల, పిపిసి స్థాయిలోనూ సూపర్వైజర్స్ టీమ్స్ ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా పౌరసరఫరాల అధికారి స్వామి కుమార్, ఇన్చార్జి డిఏఓ జగ్గు నాయక్, మార్కెటింగ్ అధికారిని పుష్పమ్మ, జిల్లా కోపరేటివ్ అధికారి శ్రీనివాసులు, డిటిఓ వెంకటేశ్వరరావు, డిఆర్డిఏ ఏపీడి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.