13-10-2025 06:42:24 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనప కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, ఆసిఫాబాద్ రాజస్థాన్ మండలాధికారి లోకేశ్వర్ రావు లతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. కెరమెరి మండలం గోయగాం గ్రామానికి చెందిన ముస్లిం మైనారిటీ మహిళలు తమ గ్రామము ఏజెన్సీ పరిధిలో ఉన్నందున గిరిజనేతర గ్రామంలో ఇండ్ల స్థలాలు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.
దహేగాం మండలం బిబ్రా గ్రామానికి చెందిన మేడి తిరుపతి గౌడ్ తాను గతంలో కొనుగోలు చేసిన భూమిని తన పేరిట పట్టా మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. రెబ్బెన మండలం దేవులవాడ గ్రామస్తులు తమ గ్రామం నుండి వెళుతున్న జాతీయ రహదారిపై యు టర్న్ అవకాశం కల్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. రెబ్బెన మండలం పుంజుమెర గ్రామానికి చెందిన రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు దారి సౌకర్యం కల్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.
సిర్పూర్ టి మండలం లోనవెల్లి గ్రామానికి చెందిన దేవాగడె మయూరి తాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసానని, దివ్యాంగురాలు అయిన తనకు ఉపాధి కల్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. జైనూర్ మండలం రాసి మెట్ట పంచాయతీ పరిధిలోని సుంగాపూర్ గ్రామానికి చెందిన షెడ్యూల్డ్ తెగల కొలాం వాసులు తమ గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. లింగాపూర్ మండలం పిక్లాతండాకు చెందిన రాథోడ్ రవీందర్ తాను తన పొలంలో సాగు చేస్తున్న పంటలను అడవి పందులు ధ్వంసం చేసినందున నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.
తిర్యాణి మండలం నాయకపు కూడా గ్రామానికి చెందిన మార్నేని లక్ష్మి తన పట్టా భూమిలో ఇతరులు అక్రమంగా ఫెన్సింగ్ వేస్తున్నందున తగు చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.