calender_icon.png 29 November, 2025 | 1:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం పర్యటన ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలి

29-11-2025 12:00:00 AM

కలెక్టర్ జితేష్ వి. పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 28, (విజయక్రాంతి):డిసెంబర్ 2న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి విచ్చేయనున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నీ శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

ఈ పరిశీలనలో భాగంగా కలెక్టర్ విశ్వవిద్యాలయంలో ని అన్ని విభాగాలను సంబంధిత శాఖల ఇంజనీరింగ్, రోడ్లు-భవనాలు, విద్యుత్, పోలీస్ శాఖ, మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనలో చేపట్టాల్సిన ఏర్పాట్లు, పనుల పురోగతి, భద్రతా చర్యలు, నిర్వహణ వంటి అంశాలపై అధికారుల నుండి వివరణలు కోరారు.శిలాఫలకం ఏర్పాటు, ఆవరణ అభివృద్ధి, అంతర్గత రోడ్ల మరమ్మత్తులు, సందర్శకుల కోసం ఏర్పాటు చేయాల్సిన మార్గదర్శక బోర్డులు, పార్కింగ్ స్థలాలు, స్టేజీ నిర్మాణం, విద్యుత్ సౌకర్యాల తనిఖీ వంటి అంశాలను స్వయంగా పరిశీలించిన కలెక్టర్, లోటుపాట్లు ఏవైనా ఉన్న వెంటనే సరిదిద్దాలని అధికారులకు ఆదేశించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూముఖ్యమంత్రి పర్యటన అత్యంత ప్రాధాన్యత కలిగినది అని, అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి, పనులను వేగవంతంగా పూర్తి చేయాలి. విశ్వవిద్యాలయం సుందరీకరణలో భాగంగా మొక్కలు నాటడం, ప్రాంగణ పరిశుభ్రత, తాగునీటి సౌకర్యాలు, శానిటేషన్ ఏర్పాట్లు పూర్తి చేసి, ముఖ్యమంత్రి పర్యటన నాటికి ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూడాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.

పర్యటన రూట్మ్యాప్ తుది రూపు, ట్రాఫిక్ సర్దుబాట్లు, అగ్నిమాపక చర్యలు, వైద్య బృందాల నియామకం, వీఐపి ప్రోటోకాల్ అమలు, వంటి అంశాలపై కూడా కలెక్టర్ ప్రత్యేక సూచనలు చేశారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రిన్సిపల్ డాక్టర్ జగన్మోహన్ రాజు, మున్సిపల్ కమిషనర్ సుజాత, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.