30-09-2025 12:58:57 AM
అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం
రంగారెడ్డి, సెప్టెంబర్ 29( విజయక్రాంతి): స్థానిక ఎన్నిలకలను ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరిస్తూ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సూచించారు.సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరం నుండి ఆర్డీఓలు, ఎంపీడీఓలు, ఎంపీఓలతో జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు జారీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను, సర్పంచ్ ఎన్నికలను రెండు విడుతలలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అక్టోబర్ 9 వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందని, అక్టోబర్ 9 నుంచి 11 వరకు ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని,
అక్టోబర్ 23న ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలి విడత పోలింగ్, అక్టోబర్ 13 నుంచి15 వరకు ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, అక్టోబర్ 27న ఎంపీటీసీ, జడ్పీటీసీ రెండో విడత పోలింగ్ ఉంటుందని తెలిపారు. అక్టోబర్ 17న సర్పంచ్ ఎన్నికలకు తొలి విడత నోటిఫికేషన్ జారీ, అక్టోబర్ 17 నుంచి 19 వరకు ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని,
31న సర్పంచ్ ఎన్నికలకు తొలి విడత పోలింగ్, అక్టోబర్ 21 నుంచి 23 వరకు ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, నవంబర్ 4 న సర్పంచ్ ఎన్నికలకు రెండో విడత పోలింగ్ ఉంటుందని తెలిపారు. స్థానిక ఎన్నికల నిర్వహణలో భాగంగ జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని, ఎం.సి.సి. నియమావళిని పక్కగా అమలు చేయాలని సూచించారు. ఎన్నికల విధులలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన విధులను నిర్వర్తించాలని ఆదేశించారు.
ఎన్నికలకు సర్వం సిద్ధం..
స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన నేపధ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీ కుముదిని సోమవారం సాయంత్రం అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా సన్నద్ధం అయి ఉన్నామని ఎన్నికల కమిషనర్ దృష్టికి తెచ్చారు.
ఎం.పీ.టీ.సీ, జెడ్.పీ.టీ.సీ ఎన్నికలతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికలను కూడా జిల్లాలో రెండు విడతలలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమిస్తూ, వారికి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బ్యాలెట్ బాక్సులు, ఇతర సామాగ్రి అందుబాటులో ఉందని,
షెడ్యూల్ విడుదలైన నేపధ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన దృష్ట్యా పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకున్నామని, ఎస్.ఎస్.టీ, ఎఫ్.ఎస్.టీ బృందాలతో కట్టుదిట్టమైన నిఘాను కొనసాగిస్తామని అన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, నోడల్ అధికారులు, ఆర్డీఓలు, ఎంపీడీఓలు, ఎంపీఓలు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.