29-01-2026 12:28:00 AM
ఎన్నికల అధికారి, కలెక్టర్ హరిత
కుమ్రం భీం ఆసిఫాబాద్ ,జనవరి 28 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా జరిగేలా పూర్తి స్థాయిలో ఏర్పా ట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. హరిత తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమా వేశ మందిరంలో ఎస్.పి. నితికా పంత్, జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆర్డీవో లోకేశ్వర్ రావు లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డులకు 28 పోలింగ్ కేంద్రాలు, కాగజ్ నగర్ మున్సిపల్ పరిధిలోని 30 వార్డులకు 85 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి 2 స్టాటి స్టిక్, 1 ఫ్లయింగ్ సర్వేయలెన్స్ బృందాలు, కాగ జ్‌నగర్ మున్సిపాలిటీకి 2 స్టాటిస్టిక్, 1 ఫ్లయింగ్ సర్వేయలెన్స్ బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు. నామినేషన్లు స్వీకరించేం దుకు రిటర్నింగ్ అధికారులను నియమించడం జరిగిందని, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రశాంతంగా జరిగేలా కలెక్టరేట్ భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 8500844365 నెంబర్ 24 గంటల పాటు పనిచేస్తుందని తెలిపారు.
పోలింగ్ కేంద్రాలలో అవసరమైన ఏర్పాట్లు, ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలలో అవసరమైన ఏర్పాట్లు, ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని, నామినేషన్ల స్వీకరణ కేంద్రాలలో వీడియోగ్రఫీ ఉంటుందని తెలిపారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నాను తెలిపారు.
ఎస్పీ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలకు బందోబస్తు పూర్తి ఏర్పాట్లు, పోలింగ్ ముందు, పోలింగ్ రోజు, కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 30 పోలీస్ ఆక్ట్ అమలు చేయడం జరుగుతుందని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
అన్ని పార్టీలు సహకారం అందించాలి
మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సంపూర్ణ సహకారం అందించాలని జిల్లా ఎన్నికల అధికారి కె. హరిత పేర్కొన్నారు. బుదవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలపై నిర్వహించిన సమావేశం నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కంట్రోల్ రూమ్ నెంబర్ 8500844365 ద్వారా ఫిర్యాదులు, సమస్యలను తెలియజేయవచ్చని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగ అధికారులు పాల్గొన్నారు.