13-05-2025 12:00:00 AM
ముషీరాబాద్, మే 12: అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 1974 మే 12న ఏర్పడి సోమవారం నాటికి 50 వసంతాలు పరిపూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రెండు తెలుగు రాష్ట్రాల గౌరవ అధ్యక్షురాలు కామ్రేడ్ విమలక్క ఆధ్వర్యంలో నిర్వహించిన స్ఫూర్తి సభ విజయవంతమైంది.
ముందుగా సుందరయ్య పార్క్ నుంచి కార్యక్రమం నిర్వహించిన వీఎస్‌టీ హాల్ వరకు వందలాది మందితో కళా ప్రదర్శన సాగింది. అనంతరం ఖమ్మం జిల్లాకు చెందిన అరుణోదయ సీనియర్ కళాకారుడు, అరుణోదయ రాష్ట్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ రాములు అరుణోదయ జెండాను ఎగరవేశారు.
ఆ తర్వాత అమరుల స్థూపం వద్ద కళాకారులు ఎర్రజెండాకు, అమరవీరులకు లాల్ సలాం చెపుతూ విప్లవ గీతాలు ఆలపించారు. అరుణోదయ, పీడీఎస్‌యూ, పీవోడబ్ల్యూ మూడు విప్లవ ప్రజాసంఘాలకు 50 ఏళ్లు నిండిన సందర్భంగా అరుణోదయ ఆడియో, వీడియో పాటను కామ్రేడ్ అంబిక ఆవిష్కరించారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ముద్రించిన సావనీర్ పుస్తకాన్ని ఎనిశెట్టి శంకర్ ఆవిష్కరించారు.
తమ్మారెడ్డి భరద్వాజ(సినీ దర్శక, నిర్మాత) మాట్లాడుతూ.. అరుణోదయ తన ఆశయసాధనలో మరింత శక్తిని పొందుకొని ముందుకు కదిలి సాగాలన్నారు. దివి కుమార్(జన సాహితి అధ్యక్షుడు) మాట్లాడుతూ.. సాంస్కృతిక రంగంలో జీవితకాలం కృషి చేసిన వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. జీవన్ కుమార్(మానవ హక్కుల వేదిక) మాట్లాడుతూ.. పాట ప్రజలది, కష్టజీవులదన్నారు.
ప్రొఫెసర్ కొండా నాగేశ్వరావు మాట్లాడుతూ.. 50 ఏళ్ల కాలంలో అరుణోదయ ప్రజల పక్షాన పోరాటం చేసిందన్నారు. ఎనిశెట్టి శంకర్ మాట్లాడుతూ.. అరుణోదయ పీడతుల పక్షాన నిలబడిందన్నారు. డాక్టర్ ఏకే ప్రభాకర్ మాట్లాడుతూ.. అరుణోదయ 50 సంవత్సరాల పాత్ర గొప్పదన్నారు. ఈ సావనీర్‌లో పూర్తిస్థాయిలో ఉద్యమ కార్యక్రమాలను ఇంకా రికార్డు చేయాలన్నారు.
కొల్లాపురం విమల మాట్లాడుతూ.. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణ ఉద్యమంలో కూడా క్రియాశీలక పాత్ర పోషించిందన్నారు. కార్యక్రమంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతుల రమేష్, ఏపూరి మల్సుర్, రాకేష్, అని, ప్రొఫెసర్ కాసిం, మోత్కూరు శ్రీనివాస్, పీవోడబ్ల్యూ అరుణ తదితరులు పాల్గొన్నారు.