calender_icon.png 24 July, 2025 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మణుగూరులో భళారే విచిత్రం..!

23-07-2025 01:19:14 PM

పట్టణంలో బూడిద వాన 

ఇదేందయ్యా ఇది.. మేమెప్పుడు చూడలే.. ప్రజల ఆశ్చర్యం

మణుగూరు,(విజయక్రాంతి): వర్షాకాలం వస్తే వానలు పడడం, వరదలు రావడం సహజం. అప్పుడప్పుడు  వడగళ్లు పడడం సర్వ సాధారణం. కానీ వీటికి భిన్నంగా మున్సిపాలిటీ పరిధిలోని గాంధీ బొమ్మ సెంటర్లో బుధవారం  వింత సంఘటన చోటు చేసు కుంది. బూడిద వాన కురిసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో ప్రజలు ఇదేందయ్యా ఈ వింత  ఇది.. మేమెప్పుడు చూడలే.. అంటూ ఆశ్చర్యపోతున్నారు. నైరుతి రుతు పవనాల కారణంగా గత రెండు రోజులుగా మండల వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షం పడుతుంది. ఈ నేపథ్యంలో బుధవారం గాంధీ బొమ్మ సెంటర్ లో వర్షంతోపాటు బూడిద వర్షాన్ని  చూసి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరైతే బూడిద వర్షం ను వింతగా చూస్తున్నారు. చాలా మంది కురుస్తున్న వర్షాన్ని  సెల్‌ ఫోన్లలో చిత్రీకరించి బంధిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త జిల్లా వ్యాప్తంగా హల్‌చల్ చేస్తోంది. బూడిద వర్షం ఏంటి కారణం ఏమిటని,  ఆసక్తికర చర్చ మండలంలో జరుగుతుంది.

గాంధీ బొమ్మ సెంటర్  పరిసరాల్లో ఈ ఉదయం మొదలైన వాన, సహ జమైన వర్షం కాదు, అచ్చం చిప్స్ తో మిక్స్ చేసిన బురద నీరు  పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ వర్షాన్ని తిలకించేందుకు వానలో బయటకు వెళ్లిన వారు నానడం కాదు వారి బట్టలు  సైతం మురికి మాస్క్‌లా మారి పోయాయి. అంతే కాదు… ఇళ్ల  పరిసరాలలో బూడిదరంగు ప్రవాహంలో నీళ్లు పారాయి.

ఈ విచిత్ర వానకు కారణం ఏమిటి...?

మండలంలో ఓవైపు ఓ పక్క ఓసీలు (ఒపెన్ కాస్ట్ , బొగ్గు శుద్ధి కేంద్రాలు), బొగ్గు రవాణా లారీల నుండి  వెలువడే  బూడిద, మరో వైపు భద్రాద్రి పవర్ ప్లాంట్,యాష్ పాండ్,  డంపింగ్, కాలుష్యం, వాతావరణ నిబంధనల పాటిం చకపోవడం వల్ల గాలిలో కలసిన బూడిద రేణువులు  వర్షపు జలం తో కలసి ప్రస్తుతం ఈ బూడిద వర్షం కురిసిందని, పర్యావరణ నిపుణులు తెలుపుతున్నారు. ఈ వింత వర్షం కురవడానికి వాతావరణ మార్పు ప్రభావమా?.. లేదా మానవ తప్పిదాల ఫలితమో సంబంధిత అధికార యంత్రాంగం తక్షణమే పరిశీలన చెయాలని,  ఈ అనూహ్య వర్షంపై సరైన ప్రణాళికలు రూపొందించి  ప్రజారోగ్యం కాపాడే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.