23-07-2025 01:24:29 PM
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అలసత్వం, తప్పుడు నివేదికల నమోదుపై కలెక్టర్ సీరియస్.
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): జిల్లాలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో అలసత్వం, తప్పుడు నివేదికల నమోదు వంటి తీవ్ర నిర్లక్ష్యం కారణంగా నలుగురు పంచాయతీ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు బల్మూర్ మండలంలోని పోలిశెట్టి పల్లి గ్రామ పంచాయతీ సెక్రెటరీ ఏం.బాలరాజు, బిజినపల్లి మండలంలోని గంగారం గ్రామ సెక్రెటరీ టి.నరేందర్ రెడ్డి, అల్లిపూర్ గ్రామ పంచాయతీ సెక్రెటరీ జి.రజిని, ఊరుకొండ మండలంలోని గుడిగానిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి డి.రామచంద్రయ్యలను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పనులలో జాప్యం, తప్పుడు నివేదికలు వంటి ఘటనలు వెలుగులోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సమర్థంగా వినియోగించాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులపై ఉండడంతో, నిర్లక్ష్యానికి తావులేకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.