calender_icon.png 26 August, 2025 | 12:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చావుకు వెళ్తే మృతదేహంతో ఫొటో దిగి పెట్టాలట

25-08-2025 06:07:43 PM

కలెక్టరేట్​ ఎదుట ఆశా వర్కర్ల ధర్నా

తమ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కు వినతి

కామారెడ్డి,(విజయక్రాంతి): అధికారుల వేధింపులు తట్టుకోలేకపోతున్నామని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. బంధువులు చనిపోయారని అధికారులను సెలవు అడిగితే చావులో శవంతో ఫొటో దిగి పంపాలని అడుగుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆశా వర్కర్లు కలెక్టరేట్​ను ముట్టడించారు. దాంతో కలెక్టరేట్ వద్ద బారికేడ్లు పెట్టి ఆశాలను పోలీసులు అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా అధికారులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు మాట్లాడుతూ.. జిల్లాలో వైద్యాధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని, తమపై వారికి కాకుండా తమకు పనులు చెబుతున్నారని వాపోయారు. అధికారుల పర్యటనల సమయంలో రాత్రి వరకు ఉండాల్సి వస్తోందని, ఒకవేళ ఉండకపోతే మెమోలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

జాబ్​ చార్ట్​ ఒకటి.. పనిచేసేది ఒకటి..

అధికారుల పర్యటన సమయంలో ఏఎన్ఎంలు (ANM) ఉండడం లేదని, తమనే టార్గెట్ చేస్తున్నారని వాపోయారు. డెలివరీల సమయంలో ఆస్పత్రికి వెళ్తే రెండురోజుల పాటు అక్కడే ఉండాల్సి వస్తుందన్నారు. తమకు ఉన్న జాబ్ చార్ట్ ఒకటని, చేసే విధులు వేరని పేర్కొన్నారు. ఆదివారం కూడా ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు సబ్ సెంటర్లలో డ్యూటీలు వేస్తున్నారని, సబ్ సెంటర్​కు వెళ్తే గ్రామాల్లో ప్రజల బాధలు ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నించారు. రెండు నెలల నుంచి వేతనాలు పెండింగ్​లో ఉన్నాయని, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలన్నారు.

2వ తేదీనుంచి సహాయ నిరాకరణ..

వచ్చేనెల 1వ తేదీ లోపు సమస్యలు పరిష్కరించకుంటే 2వ తేదీ నుంచి సహాయ నిరాకరణ చేస్తామని హెచ్చరించారు. సుమారు గంట తర్వాత ఇన్​ఛార్జి డిప్యూటీ డీఎంహెచ్​వో సంధ్య ఆశాల వద్దకు చేరుకుని వారి సమస్యలు నోట్ చేసుకున్నారు. ఆదివారం డ్యూటీలు మెడికల్ ఆఫీసర్లకు మాత్రమే ఇచ్చామని, ఆశలకు కాదన్నారు. డెలివరీల కోసం వెళ్లినప్పుడు ఆస్పత్రిలో ఉండడానికి ఒక గదిని ఏర్పాటు చేయాలనే విషయమై మాట్లాడతామన్నారు. దీంతో ఆశా కార్యకర్తలు ఆందోళన విరమించారు.