calender_icon.png 26 August, 2025 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అశ్వాపురంలో యూరియా కొరతపై బీఆర్‌ఎస్ ఆందోళన

26-08-2025 12:28:37 AM

రైతుల పక్షాన వినతిపత్రం సమర్పణ

అశ్వాపురం,(విజయక్రాంతి): మండలంలో యూరియా కొరత తీవ్రరూపం దాల్చింది. రైతులు పంటలకు అవసరమైన ఎరువులు దొరకక ఇబ్బందులు పడుతుండగా, వారి తరఫున బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ముందుకు వచ్చారు. సోమవారం  అశ్వాపురం మండల కేంద్రంలోని రైతు వేదిక ఎదుట బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన ర్యాలీ, ధర్నా నిర్వహించారు. అనంతరం వ్యవసాయ విస్తరణ అధికారికి వినతిపత్రం అందజేశారు. పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు కోడి అమరేందర్ యాదవ్ మాట్లాడుతూ తప్పుడు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం 20 నెలలు అయినా రైతులకు కనీసం యూరియా సరఫరా చేయడంలో విఫలమైంది.

ప్రస్తుతం విత్తనాలు వేసిన పంటలు ఎరువుల కొరతతో ఎండిపోతూ రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రైతులకు ఎప్పుడూ కొరత అనేది రాలేదు. కానీ కాంగ్రెస్ పాలనలో రైతులు నష్టపోతున్నారు అని మండిపడ్డారు. యూరియా పంపిణీని షరతులు లేకుండా చేయాలని, బ్లాక్ మార్కెట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని,  పారదర్శక పంపిణీ కోసం ప్రత్యేక పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని, ఇప్పటికే పంటలు దెబ్బతిన్న రైతులకు పరిహారం అందించాలనీ డిమాండ్ చేశారు.

అలాగే భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో యూరియా నిల్వలు ఉంచాలని, రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని కోడి అమరేందర్ యాదవ్ స్పష్టం చేశారు. రైతు సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం, సీనియర్ నాయకులు ఈదర సత్యనారాయణ, కందుల కృష్ణార్జునరావు, సూదిరెడ్డి గోపిరెడ్డి, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెన్న అశోక్ కుమార్, తో పాటు  యువజన నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.