05-07-2025 12:17:54 AM
సంగారెడ్డి, జూలై 4(విజయక్రాంతి): పట్టణంలోని ఆస్తుల (అసెస్మెంట్) లెక్క ఇక పక్కాగా తేలనుంది. భువన్ యాప్ ద్వారా బల్దియా అధికారులు ప్రత్యేక సర్వేకు శ్రీకారం చుట్టారు. క్షేత్రస్థాయికి వెళ్లి వాస్తవ విస్తీర్ణం ఆధారంగా వివరాలను యాప్లో నమోదు చేస్తున్నారు. నివాస గృహాలతో పాటు వాణిజ్యపరమైన భవనాలను సైతం పరిశీలిస్తున్నారు. వాటి ఆధారంగానే ఇక పన్ను మదింపు ఉంటుంది.
పక్కాగా పన్ను మదింపు..
సంగారెడ్డి మున్సిపల్ పరిధిలో 20,529 అసెస్మెంట్లు ఉండగా వాటికి గాను ఏడాదికి రూ.15.79 కోట్ల ఆస్తి పన్ను డిమాండ్ ఉంది. ఇందులో ఏటా సుమారు రూ.3.24 కోట్ల వరకు వసూలవుతున్నాయి. అయితే పన్ను విధింపులో అనేక అక్రమాలు జరుగుతున్నాయనే విమర్శలు వ్యక్త మవుతున్నాయి. పలు ప్రాంతాల్లో బల్దియా సిబ్బంది యజమానులతో కుమ్మక్కై చేతివాటం ప్రదర్శిస్తూ ఆస్తి విలువను తక్కువగా నమోదు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
కొంతమంది వాణిజ్యపరమైన ఆస్తులను సైతం నివాస గృ హంగా చూపించి తక్కువగా పన్ను చెల్లిస్తున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం భువన్ యాప్ సర్వేకు ఆదేశించింది. ఇందులో భాగంగా బల్దియా సిబ్బంది ఇంటింటికి వెళ్లి జీపీఎస్ ట్రాకింగ్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. దీంతో ఆస్తి పన్ను మదింపు పక్కాగా ఉండటంతో పాటు వసూళ్లు సైతం పెరగనున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
సర్వే సాగుతుందిలా....
ఈ యాప్ ద్వారా పట్టణంలోని ఆస్తుల లెక్క తేల్చేందుకు 25 మంది బల్దియా సిబ్బందిని ఎంపిక చేశారు. వారికి ప్రత్యేకంగా యూజర్ ఐడీ, పాస్వర్డులతో కూడిన లాగిన్లను కేటాయించారు. వీరంతా తమకు కేటాయించిన వార్డులకు వెళ్లి క్షేత్రస్థాయిలో ఆస్తుల వివరాలను సేకరించనున్నారు. నివాస, వాణిజ్య పరమైన భవనాలను వెనుక, ముందు భాగాల్లో రెండు ఫొటోలు తీసుకుంటారు. వాటి విస్తీర్ణం ఎంత అనే కొలతలను లెక్కిస్తారు.
భవన యాజమాని ఆధార్ నంబర్ నమోదు చేయగానే వారి వివరాలు కనిపించే అవకాశమున్నందున వీటి వివరాలను భువన్ యాప్లో జీపీఎస్ విధానంలో నమోదు చేస్తారు. కాగా పట్టణంలో 20,529 పాత అసెస్మెంట్లకు గాను 20,394 పూర్తి చేశారు. ఇంకా 137 పెండింగ్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే కొత్తగా 1,317 నమోదు కాగా సర్వే కొనసాగుతుంది. ఈ ఏడాదికి రూ.15.79 కోట్లకు గాను రూ.3.24 కోట్లు మాత్రమే పన్నులు వసూలు చేశారు.
ఇంకా రూ.12.54 కోట్ల బకాయి ఉంది. అలాగే ప్రతీ ఆస్తికి 10 అంకెలతో కూడిన ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ (పిటిన్)ను కేటాయిస్తారు. ఇలా వివరాలు పక్కాగా సేకరించడం ద్వారా బల్దియాకు పన్నుల రూపంలో మరింత ఆదాయం సమకూరే అవకాశముంది. సర్వే పర్యవేక్షణ కోసం బల్దియాలో ఐదుగురు రెవెన్యూ ఇన్స్పెక్ష ర్లకు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం సర్వే కొనసాగుతుందని తెలిపారు
పకడ్బందీగా సర్వే
పట్టణంలోని ఆస్తులను పక్కాగా తేల్చేందు ప్రభుత్వం భువన్ యాప్ ద్వారా సర్వే కు ఆదేశించింది. అందుకనుగుణంగా ఆస్తుల సర్వే చేపట్టాం. 25 మందితో కూడిన బృందం ఆయా వార్డుల్లో పకడ్బందీగా సర్వే కొనసాగుతుంది. లాగిన్ ఇచ్చాక వేగవంతంగా పూర్తి చేస్తాం. అనుకున్న లక్ష్యానికి బకాయిలను సైతం పూర్తి చేస్తాం.
ప్రసాద్ చౌహాన్, కమిషనర్, సంగారెడ్డి మున్సిపాలిటీ