24-01-2026 12:00:00 AM
విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమీక్షలో కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్, జనవరి 23 (విజయక్రాంతి): ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసుల విచారణను వేగవంతం చేసి, బాధితులకు త్వరితగతిన న్యాయం, పరిహారం అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యం లో ’జిల్లాస్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ’ సమావేశాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు నీలాదేవి, అధికారులతో కలిసి కలెక్టర్ అధ్యక్షత సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... అట్రాసిటీ కేసుల్లో బాధితులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారాన్ని ఎటువంటి జాప్యం లేకుండా, వెంటనే వారి ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బాధితులకు రక్షణ కల్పిస్తూ, వారికి భరోసా కల్పించడం లో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ శ్యామలా దేవి, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి సునీత కుమారి, ఈడి ఎస్సీ కార్పొరేషన్ మనోహర్, ఆర్డీఓ స్రవంతి, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.