22-12-2025 01:40:16 AM
ములుగు, డిసెంబర్21(విజయక్రాంతి): ములుగు జిల్లా జాకారం గ్రామంలో గల శ్రీ గట్టమ్మ దేవస్థానంలో నిర్వహించనున్న 2026 మేడారం జాతర ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. జాతరకు లక్షలాది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఆలయ పరిసరాలలో నిర్వహించే వ్యాపార కార్యకలాపాలపై దేవాదాయ శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ నెల 24వ తేదీ బుధవారం రోజున ఉదయం 10:00 గంటలకు దేవాలయ ప్రాంగణంలో కొబ్బరికాయలు, పసుపు, కుంకుమతో పాటు ఇతర వివిధ అంశాలకు సంబంధించిన దుకాణములు నడుపుకొనే హక్కుల కొరకు వేలంపాట దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో దేవాదాయ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు కార్యనిర్వహణాధికారి బిళ్ళ శ్రీనివాస్ తెలిపారు.
వేలం ద్వారా ఆలయ ఆదాయం పెరగడంతో పాటు, పారదర్శకత కూడా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ వేలములలో పాల్గొనదలచిన ఆసక్తి గల పాటదారులు నిర్ణీత సమయానికి హాజరై అవసరమైన నిబంధనలు పాటిస్తూ వేలంపాటలో పాల్గొనాలని కార్యనిర్వాహణాధికారి బిళ్ళ శ్రీనివాస్ కోరారు.