24-07-2025 01:25:02 AM
సైబరాబాద్‌లో రూ. 2,0-25 కోట్ల స్కామ్
హైదరాబాద్, సిటీబ్యూరో, జూలై23 (విజయక్రాంతి): అధిక రాబడులు ఇస్తామని ఆశచూపి ప్రజల నుంచి సుమారు రూ. 2,0-25 కోట్లు వసూలు చేసి మోసం చేసిన కేసులో ఏవీ ఇన్‌ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ తిమ్మిరి శామ్యూల్‌ను సైబరాబాద్ ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ (ఈఓడబ్ల్యూ) పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. బం జారాహిల్స్‌లోని అతని నివాసం వద్ద శామ్యూల్‌ను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు తిమ్మిరి శామ్యూల్‌తో పాటు ఏవీ ఇన్‌ఫ్రాకాన్ ఎండీ గోగుల లక్ష్మీ విజయ్‌కుమార్ మరియు ఇతరులు అమాయక ప్రజలను మోసం చేయాలని ముందుగానే పథకం పన్నారని తెలిపారు. ఎం/ఎస్ ఏవీ ఇన్‌ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటె, ఎం/ఎస్ ఏవీ ఆర్గానో ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల పేరుతో పెట్టుబడి, ప్రీ-లాంచ్, బై-బ్యాక్ పథకాల్లో భారీ రాబడులు ఇస్తామని తప్పుడు హామీలు ఇచ్చారన్నారు. ఇప్పటివరకు దాదాపు 150 మంది బాధితుల నుంచి సుమారు రూ. 20 కోట్ల నుంచి 25 కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోందన్నారు.
నమ్మించి నయవంచన
నిందితులు గోగుల లక్ష్మీ విజయ్ కుమార్, తిమ్మిరి శామ్యూల్ కలసి భూమి యాజమాన్యం గురించి తప్పుగా చెప్పి, కల్పిత పథకాలను (పెట్టుబడి, బై-బ్యాక్, ప్రీ-లాంచ్) ప్రారంభించారన్నారు. పెట్టుబడిదా రులను నమ్మించేందుకు అమ్మకపు ఒప్పందాలు, ఎంఓయూలు, సేల్ డీడ్‌లను బాధి తుల పేరు మీద అమలు చేశారన్నారు. అయితే, వాస్తవానికి వీరు ఓపెన్ ప్లాట్లను రిజిస్టర్ చేయలేదని, డిపాజిట్ చేసిన మొత్తా న్ని కూడా తిరిగి ఇవ్వలేదని పోలీసులు పేర్కొన్నారు.
ఒక వ్యక్తి రూ.10 లక్షలు ఒక సంవత్సరానికి డిపాజిట్ చేస్తే, కంపెనీ ఒక సంవత్సరం తర్వాత అసలు మొత్తంతో పాటు 50% అదనపు ప్రయోజనాన్ని తిరిగి ఇస్తుందని హామీ ఇచ్చారని తెలిపారు. ఒక వ్యక్తి రూ.10 లక్షలు లేదా రూ.20 లక్షలు ఒక సంవత్సరానికి డిపాజిట్ చేస్తే, కంపెనీ కొంత భూమి/ఓపెన్ ప్లాట్‌ను రిజిస్టర్ చేస్తుందని, ఒక సంవత్సరం తర్వాత కంపెనీ ఆ భూమి/ప్లాట్‌ను తిరిగి కొనుగోలు చేసి, పెట్టుబడి/ డిపాజిట్‌పై 50% అదనపు మొత్తాన్ని తిరిగి ఇస్తుందని హామీ ఇచ్చానట్లు పేర్కొన్నారు. హై-రైజ్/సెమీ-గేటెడ్ అపార్ట్‌మెంట్లలో 2 బీహెచ్‌కే ఫ్లాట్‌లను చాలా తక్కువ ధరకు ఇస్తామని, రెండు సంవత్సరాలలోపు అప్పగిస్తామని, అధిక రాబడులు ఇస్తామని హామీ ఇచ్చారని పోలీసులు వివరించారు.
ఇతర పెట్టుబడులకు మళ్లింపు
నిందితులు ఏవీ ఇన్‌ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్, దాని డైరెక్టర్లు సంగారెడ్డి జిల్లా మొరిగి (గ్రా), వికారాబాద్ జిల్లా కొమ్‌శెట్‌పల్లి (గ్రా), జనగాం జిల్లా పెంబర్తి (గ్రా), ఘట్‌కేసర్ మండలం కొండాపూర్ (గ్రా), కీసర మండలం నాగారం (గ్రా), మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా చౌదర్‌గూడెం, నారపల్లి ప్రాంతాల్లో తమ వెంచర్లను ప్రారంభించారు. గోగుల లక్ష్మీ విజయ్ కుమార్, తిమ్మిరి శామ్యూల్ 2021లో తమ కార్యకలాపాలను ప్రారంభించి, చట్టబద్ధమైన కంపెనీ ని నడుపుతున్నట్లు ప్రజలను నమ్మించి మోసం చేశారని పోలీసులు తెలిపారు. డిపాజిటర్ల నుంచి వసూలు చేసిన డబ్బును నిందితులు ఇతర పెట్టుబడులకు మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఏవీ ఇన్‌ఫ్రాకాన్ ఎండీ గోగుల లక్ష్మీ విజయ్ కుమార్ ను జూన్ 25, 2025న అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు. ప్రస్తుతం అక్రమంగా మళ్లించిన నిధులను గుర్తించి, డిపాజిటర్ల డబ్బును రికవరీ చేసేందుకు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ప్రీ-లాంచ్, బై-బ్యాక్ వంటి పథకాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సైబరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.ఈ కేసును సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పీఎస్ ఏసీపీ హుస్సుని నాయుడు దర్యాప్తు చేస్తున్నారు. సైబరాబాద్ డీసీపీ (క్రైమ్స్, ఈఓడబ్ల్యూ) ముత్యం రెడ్డి పర్యవేక్షణలో విచారణ జరుగుతోంది.