19-11-2025 06:15:34 PM
పాపన్నపేట (విజయక్రాంతి): యూత్ అండ్ ఎకో క్లబ్ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన పాపన్నపేటలో ఉన్నత పాఠశాల విద్యార్థులు భూమిని కాపాడండి అంటూ పాపన్నపేట అంగడిలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంగడికి చుట్టుపక్కల మండలాల నుండి సుమారు 30 గ్రామాల ప్రజలు వస్తుంటారు. వీరికి విద్యార్థులు అంగడిలో తిరుగుతూ అవగాహన కల్పించారు.
ఇందులో భాగంగా మొక్కలు నాటండి, ప్రకృతిని కాపాడండి, జంతువులను సంరక్షించండి, విద్యుత్ ఆదా చేయండి, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించండి, నీటిని సంరక్షించండి, కాలుష్యాన్ని నివారించండి, చెత్త కోసం బుట్టలను వాడండి అంటూ పాంప్లెట్లు పంచుతూ.. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేశ్వర్, ఉపాధ్యాయులు అంజా గౌడ్, వెంకటేశం, ప్రవీణ్, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.