19-11-2025 07:19:56 PM
కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
కోరుట్ల రూరల్ (విజయక్రాంతి): ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. బుధవారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ సందర్శించి మొక్కజొన్న కొనుగోలపై రైతుల పడుతున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుకాలం పండించి విక్రయించడానికి తీసుకువచ్చిన ధాన్యాన్ని విక్రయించే సందర్భంలో బయోమెట్రిక్ విధానంతో రైతులు ఇబ్బందులకు పాలవుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా యార్డులో నిల్వ ఉన్న మొక్కజొన్న ధాన్యాన్ని పరిశీలించి అక్కడి పరిస్థితులు స్వయంగా చూశారు.
మొక్కజొన్న పంటను విక్రయించి 20 రోజులకు పైగా అయినా చెల్లింపులు జరగకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఎమ్మెల్యే వద్ద వాపోయారు.ప్రభుత్వం తాజాగా అమలు చేస్తున్న కొన్ని విధానాల కారణంగా చెల్లింపులలో జాప్యం జరుగుతూ రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని రైతులు తెలిపారు.కొనుగోలు కేంద్రాలలో అవసరమైన సిబ్బంది, యంత్రాలు సమృద్ధిగా ఉండేలా చూడాలని,ధాన్యం కొలిచిన వెంటనే డిజిటల్ ఎంట్రీలు పూర్తి చేసి చెల్లింపుల ప్రక్రియ వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు.
రైతులకు నష్టం కలిగించే విధానాలను వెంటనే పునఃసమీక్షించాలని అధికారులను ఆదేశించారు. మార్కెట్ యార్డులో పారిశుధ్యం, తూకం యంత్రాల పని తీరు, గోదాముల స్థితి వంటి పలు అంశాలను కూడా ఎమ్మెల్యే పరిశీలించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని విక్రయించేలా అన్ని విభాగాలూ సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.రైతుల సమస్యల పరిష్కారం కోసం తక్షణమే ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సంజయ్ రైతులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వింత స్థానిక నాయకులు కోరుట్ల మండల టిఆర్ఎస్ అధ్యక్షులు దారిశెట్టి రాజేష్, జగిత్యాల జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు చీటి వెంకటరావు, గంగారెడ్డి, ఆదిరెడ్డి, బట్టు సునీల్ తదితరులు పాల్గొన్నారు.