29-08-2025 02:13:19 AM
నియామక ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): తెలంగాణ న్యాయ శాఖ కార్యదర్శిగా మహబూబ్‌నగర్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెష న్స్ జడ్జీ బీ పాపిరెడ్డి నియమితులయ్యారు. తెలంగాణ హైకోర్టు సిఫార్సు మేరకు రాష్ట్ర ప్రభుత్వం పాపిరెడ్డిని డిప్యూటేషన్ పద్ధతిలో నియమిస్తూ సీఎస్ కే రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఏడాదికాలం పాటు ఆయన ఈ పదవీలో కొనసాగనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇప్పటి వరకు న్యాయ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన రేండ్ల తిరుపతి డిప్యూటేషన్ ముగియడంతో గతవారం ఆయన రిలీవయ్యారు. ఆయన డిప్యూటేషన్ పొడగించాలని రేండ్ల తిరుపతి సీఎం రేవంత్‌రెడ్డికి అర్జీ పెట్టుకున్నారు. కానీ ప్రభుత్వం ఆయన అర్జీని తిరస్కరించింది.
తిరుపతి స్థానంలో న్యాయ శాఖ అదనపు కార్యదర్శి సునీతకు తాత్కాలిక ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో న్యాయశాఖ కార్యదర్శి పోస్టు కోసం హైకోర్టు రిజిస్ట్రార్ ప్రభుత్వానికి ఐదు పేర్లతో కూడిన జాబితాను పంపించింది. ఇందులో నుంచి బీ పాపిరెడ్డి పేరును ప్రభుత్వం ఎంపిక చేసింది.