calender_icon.png 29 August, 2025 | 7:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎడతెరిపిలేని వర్షం

29-08-2025 02:02:17 AM

  1. పొంగి ప్రవహిస్తున్న వాగులు 
  2. అప్రమత్తమైన అధికారులు 

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) ఆగస్టు 28 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. జిల్లాలోని గణపురంలో అత్యధికంగా 98.4, రేగొండలో 81.0, మొగుళ్లపల్లిలో 72.0, పలిమెల లో 63.8, చిట్యాల లో 61.2, కాటారంలో 58.6, టేకుమట్లలో 58.2, మలహర్ రావు లో 52.4, భూపాలపల్లిలో 30.4, మహాదేవపూర్ లో 29.6, మహా ముత్తారంలో 28.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. 

అధికారులను అప్రమత్తం కలెక్టర్

జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉధృతంగా పొంగిపొర్లుతున్నాయి. రహదారు లపై నీరు చేరిన చోట్ల, కాజ్వేల వద్ద ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు, వాహనదారులు వెళ్లకుండా కట్టడి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ  మొరంచపల్లి వాగు ఉధృతి అధికమైందని, ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక వద్ద  ప్రవహిస్తోందని, ఎగువ ప్రాంతాల నుండి వచ్చే వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి అవసరమైన జాగ్రత్తలు చేపట్టాలని స్పష్టం చేశారు.

రహదారులపై నీరు ప్రవహిస్తున్న మార్గాల్లో ప్రయాణాలు జరగకుండా తగిన నియంత్రణ చర్యలలో భాగంగా ట్రాక్టర్లు లేదా ఇతర వాహనాలను అడ్డు పెట్టాలని ఆదేశించారు. ప్రజలు, వాహనదారులు ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఇచ్చే సలహాలు, సూచనలు కచ్చితంగా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో 9030632608 కంట్రోల్ రూముకు కాల్ చేయాలని  సూచించారు. జాలర్లు చేపల వేటకు వెళ్లకుండా ఉండాలని కలెక్టర్ హెచ్చరించారు.

అలాగే వర్షాల కారణంగా పశువులు ప్రమాదానికి గురికాకుండా చూడాలని, వాటిని మేత కోసం బయటకు వదలకుండా యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ, యంత్రాంగా నికి సహకరించాలని, గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు.

మొరంచపల్లి వాగు  వరద ఉధృతిని పరిశీలించిన ఎమ్మెల్యే జీఎస్సార్

రేగొండ/భూపాలపల్లి ఆగస్టు 28 (విజయ క్రాంతి): జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భూపాలపల్లి మండలం మొరంచపల్లి గ్రామ శివారులోని మొరంచపల్లి వాగు వరద నీటితో ఉదృతంగా ప్రవహిస్తోంది. గురువారం భూపాల పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్థానిక నేతలతో కలిసి వరద ఉధృతిని పరిశీలించారు. 

వాగులు, వంకలు వరద నీటితో పొంగిపొర్లడంతో నియోజకవర్గంలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆయా శాఖల అధికారులను తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను అంచనా వేసి, ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అవసరమైన సహాయ చర్యలను చేపట్టాలని ఆదేశించారు.

అధికారులు అప్రమత్తంగా ఉండాలి 

గార్ల, ఆగష్టు 28 (విజయ క్రాంతి): వర్షా ల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. గురువారం బయ్యారం మండలంలో  పర్యటించిన కలెక్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. బయ్యారం  నామాలపాడు రహదారి మధ్యలో ఉన్న లో లెవెల్ కాజ్ వే ను సందర్శించి వర్షాలు కురుస్తున్న సందర్భంలో తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు తగు సూచనలు చేశారు. బయ్యారం పెద్ద చెరువును సందర్శించి వరద పరిస్థితిని గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.  కలెక్టర్ వెంట బయ్యారం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విజయ్, తహసిల్దార్ నాగరాజు, ఎంపీడీవో విజయలక్ష్మి పాల్గొన్నారు.