calender_icon.png 2 July, 2025 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

తెరచుకున్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు

02-07-2025 12:00:00 AM

  1. మొత్తం 14 గేట్లు ఎత్తివేత
  2. బ్యారేజీలో నిల్వ ఉన్న నీళ్లను దిగువ గోదావరిలోకి 

నిజామాబాద్, జూలై 1 (విజయక్రాంతి): మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను అధికారులు మంగళవారం ఎత్తివేశారు. మొత్తం 14 గేట్లు ఉండ గా అన్నింటిని పైకి ఎత్తి బ్యారేజీలో నిల్వ ఉన్న నీళ్లను దిగువ గోదావరిలోకి వదిలిపెట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మహా రాష్ట్ర ప్రభుత్వం ఏటా జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు నదీ ప్రవాహానికి ఆటంకం లేకుండా ప్రాజెక్టు గేట్లను తెరుస్తుంది.

ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం తెలంగాణ, మహారాష్ట్ర ఇరు రాష్ట్రాల నీటి పారుదల, సీడబ్ల్యూసీ అధికారుల సమక్షంలో 14 గేట్లను మహారాష్ట్ర ప్రభుత్వం ఎత్తి నీటిని విడుదల చేసింది. ప్రస్తుతం 1,064 అడుగుల వద్ద నీరు నిల్వ ఉన్నదని అధికారులు తెలిపారు. 

బాబ్లీ గేట్లు తెరచుకోవడంతో దిగువన గల రైతులు, మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి నదికి నీటి ప్రవాహం సాయంత్రం వరకు పెరగనున్న నేపథ్యంలో నది పరివాహక ప్రాంత ప్రజలు, రైతులు, జాలర్లు, అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.