02-07-2025 07:57:16 PM
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్..
కరీంనగర్ క్రైం (విజయక్రాంతి): సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, డంపు యార్డు సమస్య పరిష్కారంలో భారతదేశంలోనే ముందుండి మంచి పేరు సంపాదించుకున్న ఇండోర్ తరహాలోనే కరీంనగర్ డంప్ యార్డ్(Karimnagar Dump Yard) సమస్య పరిష్కరించేందుకు తాను ముందుండి కార్యాచరణ రూపొందిస్తానని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు(In-charge Velchala Rajender Rao) పేర్కొన్నారు. నగర శివారులో డంపు యార్డు సమస్య చాలా తీవ్రంగా ఉందని, ప్రజలు శ్వాసకోశ క్యాన్సర్ ఇతర వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు పరిష్కార మార్గం కనుగొనేందుకే స్వయంగా డంప్ యార్డ్ పరిశీలించేందుకు వచ్చానని తెలిపారు.
బుధవారం సాయంత్రం కరీంనగర్ శివారులోని బైపాస్ రోడ్ లో ఉన్న డంపు యార్డును వెలిచాల రాజేందర్ రావు కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలతో కలిసి పరిశీలించారు. ట్రాక్టర్లో వెళ్లి డంప్ యార్డ్ పరిస్థితిని క్షుణ్ణంగా పర్యవేక్షించారు. ఈ సమస్య వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు తదిత అంశాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాయకులు, స్థానిక ప్రజల సమక్షంలో వెలిచాల రాజేందర్ రావ్ మాట్లాడారు. కరీంనగర్ డంప్ యార్డ్ సమస్య పరిష్కరించేందుకు తాను ముందుంటానని, ప్రజల ఆవేదన కాదు ఇది నా ఆవేదన అని పేర్కొన్నారు. డంప్ యార్డ్ సమస్య చాలా తీవ్రంగా ఉందని, ప్రజలను నిత్యం వేధిస్తున్నదని ఈ సమస్య పరిష్కారానికి ఒక మార్గాన్ని అన్వేషిస్తున్నానని తెలిపారు.
భారతదేశంలోనే ఇండోర్ వేస్ట్ మేనేజ్మెంట్ డంప్ యార్డు సమస్య పరిష్కరించి.. మంచి పేరు సాధించిందని గతంలో ఇండోరు కరీంనగర్ కంటే అద్వానంగా ఉండేదని పేర్కొన్నారు. భారతదేశంలోనే ఇండోర్ మంచి నగరంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నదని చెప్పారు. అక్కడ మన జిల్లా వాసి పరికిపండ్ల నరహరి మున్సిపల్ కమిషనర్ గా పనిచేశారని, ఆయన డంప్ యార్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ శానిటేషన్ విషయంలో అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టి ఇండోర్ ను దేశంలోనే ఆదర్శ నగరంగా తీర్చిదిద్దారని చెప్పారు. ప్రస్తుతం ఆయన భోపాల్ లో హెల్త్ సెక్రటరీగా పనిచేస్తున్నారని, కరీంనగర్ డంపు యార్డు సమస్యపై ఇటీవల ఆయనతో మాట్లాడానని తెలిపారు. గత 20 సంవత్సరాల నుంచి ఇండోర్ నగరం భారతదేశంలోనే అత్యుత్తమ నగరంగా అవార్డులు సాధిస్తున్నదని పేర్కొన్నారు. డంపు యార్డు సమస్య పరిష్కారానికి తగిన బడ్జెట్ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించే బాధ్యత తీసుకుంటానని రాజేందర్ రావు తెలిపారు.