01-07-2025 11:23:02 PM
నీళ్ల కోసం మోటారు ఆన్ చేస్తుండగా ఘటన...
హుస్నాబాద్ (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా(Siddipet District) అక్కన్నపేట మండలం పంతులుతండా పరిధిలోని దుబ్బతండాకు చెందిన కూలీ బానోతు కిష్టు(50) మంగళవారం సాయంత్రం కరెంటు షాక్ తగిలి చనిపోయాడు. తన ఇంటి మరమ్మతులు చేస్తున్న క్రమంలో నీళ్లు అవసరం పడగా సంపులోని మోటారును ఆన్ చేశాడు. దీంతో ఒక్కసారిగా షాక్ తగిలి అక్కడికక్కడే మరణించాడు. తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం... తండాలో ఉపాధి లేకపోవడంతో కిష్టు భార్యాపిల్లలతో కలిసి కొన్నేండ్ల కింద కరీంనగర్ వలస వెళ్లాడు. అక్కడ ఇద్దరు భార్యభర్తలు అడ్డా కూలీలుగా పనిచేస్తున్నారు. పదేండ్లలోపు ఉన్న ఇద్దరు పిల్లలను చదివించుకుంటున్నారు.
వానకాలం రావడంతో తండాలో ఉన్న పాత ఇల్లు ఊరుస్తుందని మరమ్మతు చేయించేందుకు కరీంనగర్ నుంచి సోమవారం సాయంత్రం వచ్చారు. మంగళవారం పనులు మొదలుపెట్టారు. మధ్యాహ్నం వరకు పనులు పూర్తి కావచ్చాయి. మిగిలిన పనులు తాను చేసి వస్తానని, ముందుగా తన భార్యాపిల్లలను కరీంనగర్ పంపించాడు. ఇల్లు కడుగుదామని నీటి సంపులోని మోటారును ఆన్ చేశాడు. దీంతో ఒక్కసారిగా షాక్ తగిలి కిందపడి చనిపోయాడు.