02-07-2025 08:56:39 PM
కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ నగరంలో తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించడానికి శాశ్వత పరిష్కార మార్గాలపై పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం(Police Commissioner Gaush Alam), మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఐఏఎస్(Municipal Commissioner Praful Desai IAS)లు సంయుక్తంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం నాడు నగరంలోని బ్లాక్ స్పాట్‌లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ... మున్సిపల్ కమిషన్ పరిధిలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే, తరచుగా రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ ప్రాంతాలను గుర్తించామని తెలిపారు.
ఈ ప్రాంతాల్లో ప్రమాదాలకు గల కారణాలను అధ్యయనం చేస్తున్నామని, వాటి నివారణకు మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పద్మ నగర్ బైపాస్, రాంనగర్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి, మంచిర్యాల చౌరస్తా, గాంధీరోడ్డు, నాఖా చౌరస్తా, కేబుల్ బ్రిడ్జి, బైపాస్ రోడ్డు వద్ద గల మలుపులను పరిశీలించినట్లు వివరించారు. ప్రమాదాల నివారణకు అవసరమైన చోట్ల ఐలాండ్‌ల ఏర్పాటు, యూ-టర్న్‌ల ఏర్పాటు, యూ-టర్న్‌ల కుదింపు, సీసీ కెమెరాల ఏర్పాటు, బైపాస్ రోడ్డులో హెచ్‌కేఆర్ సంస్థ చేపట్టవలసిన నిర్మాణాలు వంటి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో పోలీసు శాఖతో పాటు మున్సిపల్, ఆర్‌అండ్‌బి, హెచ్‌కేఆర్ సంస్థ, స్మార్ట్ సిటీ డెవలప్‌మెంట్ ప్రతినిధులు పాల్గొన్నారు. నగర ప్రజల భద్రతే లక్ష్యంగా శాశ్వత పరిష్కారాల దిశగా చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.