02-07-2025 08:07:48 PM
పిడిఎస్యూ జిల్లా అధ్యక్షులు సింహాద్రి..
సూర్యాపేట (విజయక్రాంతి): పెండింగ్ లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ లలో వెంటనే విడుదల చేయాలని పిడిఎస్యూ జిల్లా అధ్యక్షుడు పుల్లూరు సింహాద్రి(PDSU District President Pulluru Simhadri) అన్నారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం సంఘ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో ఉన్న డిగ్రీ కాలేజీలు బంద్ నిర్వహించి, కొత్త బస్టాండ్ సమీపంలోని జగ్జీవన్ రావ్ బొమ్మ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. నేడు అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తి అవుతున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఇవ్వకుండా కాలయాపన చేయడం సరి కాదన్నారు. 7200 కోట్ల రూపాయలను పెండింగ్ లో ఉంచి పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులను విద్యను దూరం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రపంచ అందాల పోటీలు నిర్వహించి 200 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయల బిల్లు చెల్లిస్తున్నారు కానీ ఈ పథకం ద్వారా చదువుకునే పేద విద్యార్థులకు ఎందుకు సహాయంగా తోడ్పడడం లేదని విమర్శించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని, విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ డివిజన్ ప్రధాన కార్యదర్శి పిడమర్తి భరత్, నాయకులు, సంధ్య, మానస, స్వాతి, మహేశ్వరి, లావణ్య, నందిని, ప్రసన్న, యశ్వంత్, మహేష్, నవీన్, వినయ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.