27-10-2024 12:00:00 AM
టీమిండియా రెండో టెస్టులోనూ పూర్తిగా చేతులెత్తేసింది.
ఐదు రోజులు ఆడడం ఎందుకులే అన్నట్లు ప్రత్యర్థికి మూడు రోజుల్లోనే మ్యాచ్‌ను అప్పగించి పుష్కర కాలం తర్వాత స్వదేశంలో తొలి టెస్టు సిరీస్ ఓటమిని మూటగట్టుకుంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కివీస్ సిరీస్‌ను ఎగురేసుకుపోగా..
భారత్‌కు పరాభవమే మిగిలింది.
పుణే: న్యూజీలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 113 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే న్యూజీలాండ్ 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఐదు రోజులు ఆడడంలో విఫలమైన భారత్ మూడు రోజుల్లోనే ప్రత్యర్థికి మ్యాచ్ అప్పగించి ఘోర అవమానం మూటగట్టుకుంది.
ఫలితంగా స్వదేశంలో బెబ్బులిలా విరుచుకుపడే టీమిండియా పుష్కర కాలం తర్వాత తొలి టెస్టు సిరీస్ ఓటమిని మూటగట్టుకుంది. 359 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 245 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (77) మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ మిగతా బ్యాటర్ల వైఫల్యం జట్టు పరాజయానికి బాటలు వేసింది.
రవీంద్ర జడేజా (42) పోరాడినప్పటికీ భారత్‌ను ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. కివీస్ బౌలర్లలో సాంట్నర్ 6 వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించాడు. అంతక ముందు కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌటైంది. మూడో టెస్టు నవంబర్ 1 నుంచి ముంబై వేదికగా జరగనుంది.
స్పిన్ ఉచ్చులో పడి..
స్పిన్‌ను సమర్థంగా ఆడడంలో పేరున్న భారత బ్యాటర్లు అదే స్పిన్ ఉచ్చులో చిక్కుకొని విలవిల్లాడిపోయారు. ఒకప్పుడు భారత్‌ను సొంతగడ్డపై ఓడించడం ప్రత్యర్థికి సవాల్. తాజాగా సుందర్, అశ్విన్ లాంటి స్పిన్నర్లు వికెట్లు పడగొట్టిన చోటే కివీస్ పార్ట్‌టైమ్ స్పిన్నర్ అయిన మిచెల్ సాంట్నర్ 13 వికెట్లతో రాణించడం కొసమెరుపు.
స్పిన్‌ను బాగా ఆడతారని పేరున్న రోహిత్, కోహ్లీ, పంత్, గిల్ పూర్తిగా చేతులెత్తేశారు. జైస్వాల్ ఒక్కడే కాస్త పర్వాలేదనిపించాడు. ఇలాంటి బ్యాటింగ్‌తో రానున్న ఆస్ట్రేలియా సిరీస్‌లో ఎలా ఆడతారన్నది అంతుచిక్కని ప్రశ్న. ఫలితంగా ఈ ఓటమితో టీమిండియాకు స్వదేశంలో వరుస 18 టెస్టు సిరీస్ విజయాలకు బ్రేక్ పడింది. ఇక దాదాపు 70 ఏళ్ల తర్వాత న్యూజీలాండ్ భారత గడ్డపై తొలి టెస్టు సిరీస్ సొంతం చేసుకోవడం విశేషం.
అదొక్కటే ఊరట..
న్యూజీలాండ్‌కు టెస్టు సిరీస్ కోల్పోయినప్పటికీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పట్టికలో మాత్రం టీమిండియా తొలి స్థానాన్ని నిలుపుకుంది. రెండు వరుస ఓటములు ఎదురైనప్పటికీ 98 పాయింట్లు (62.82 పర్సంటైల్)తో భారత్ టాప్‌లో కొనసాగుతుండగా.. 62.50 పర్సంటైల్‌తో ఆసీస్ తర్వాతి స్థానంలో ఉంది.
రెండు విజయాలతో కివీస్ 50 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఒక్క ఓటమితో డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ ఆడేందుకు శ్రీలంక, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ రేసులోకి వచ్చాయి.