calender_icon.png 19 November, 2025 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బనకచర్ల పేరుమార్చి..!

19-11-2025 12:33:52 AM

  1. ఆ ప్రాజెక్టును పరిగణలోకి తీసుకోవద్దని కోరాం
  2. ఆల్మట్టి 519 మీటర్లకంటే ఎక్కువ ఎత్తు పెంచొద్దని సుప్రీం కోర్టు స్టే 
  3. తెలంగాణలోని పలు ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులివ్వాలని అడిగాం
  4. కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో మంత్రి ఉత్తమ్ భేటీ

హైదరాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి): పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును ఆంధ్రప్ర దేశ్ ప్రభుత్వం పేరు మార్చి చేపడుతోందని, ఆ ప్రాజెక్టును తాము వ్యతిరేకించినట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్నాయని పేర్కొన్నారు. ఏపీ ప్రాజెక్టును పరిగ ణలోకి తీసుకోవద్దని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌ను కోరినట్లు తెలిపారు.

మంగళవారం ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుతోపాటు, తెలంగాణలోని పలు పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్రమంత్రితో ఆయన చర్చించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ... పోలవరం- బనకచర్ల ప్రాజెక్టుపేరు మార్చి మళ్లీ అనుమతుల కోసం ఏపీ ప్రయత్నిస్తోందని చెప్పారు.

ఆల్మట్టి డ్యాం 519 మీటర్ల కంటే ఎత్తు పెంచొద్దని గతంలో సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని, అయినా ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నిస్తుం దని పేర్కొన్నారు. ఆల్మట్టి ఎత్తు పెంచేందుకు  భూసేకరణ కోసం కర్ణాటక ప్రభుత్వం జీవో జారీ చేసిందని, ఆ ప్రభుత్వం జారీ చేసిన జీవోను కేంద్రజల్‌శక్తి శాఖ మంత్రి పాటిల్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. దీంతోపాటు తెలంగాణలోని ప్రాణహిత--చేవెళ్ల, పాలమూరు--రంగారెడ్డి, సీతారామ పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. 

తమ ప్రభుత్వంలో కేఆర్‌ఎంబీ టెలీమె ట్రీ స్టేషన్ పనుల్లో పురోగతి వచ్చిందని, పనులు త్వరగా పూర్తి చేయాలని కోరినట్లు తెలిపారు. మరో 20 టెలీమెట్రీ స్టేషన్ల నిర్మాణం చేపడుతామని హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఫేజ్2లో 9, ఫేజ్3లో 11 నిర్మాణం చేపడుతామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా తెలంగాణ కృష్ణా, గోదావరి నది జలాల నీటి వాటాను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల పోరాటం చేస్తుందన్నారు.

కృష్ణా, గోదావరి నది పరీవాహక ప్రాంతాల్లో సుదీర్ఘకాలం నుంచి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు ఇవ్వాలని  కోరారు. సమ్మక్క-సాగర్ ప్రాజెక్టుపై లేవనెత్తిన అభ్యంతరాలను ఇప్పటికే నివృత్తి చేశామని, దానికి వెంటనే అనుమతులు ఇవ్వాలని.. పోలవరం నుంచి వరద జలాలను తరలించే ఏపీ ప్రయత్నాలను కేంద్రమే నిలువరించాలని కేంద్రమంత్రిని కోరినట్లు తెలిపారు.