23-09-2025 10:50:17 PM
ప్రముఖ ఆధ్యాత్మిక, అమ్మవారి ఉపాసకురాలు కొండూరి పద్మావతి
కరీంనగర్,(విజయక్రాంతి): సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఎంతో కృషి చేస్తున్నారని, సనాతన ధర్మ రక్షకులుగా బండి సంజయ్ చరిత్రలో నిలిచిపోతారని ప్రముఖ ఆధ్యాత్మిక, అమ్మవారి ఉపాసకురాలు కొండూరి పద్మావతి అన్నారు. శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ మహాశక్తి దేవాలయంలో మంగళవారం రోజున హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక, అమ్మవారి ఉపాసకురాలు కొండూరి పద్మావతి వేలాదిగా తరలివచ్చిన మహిళలకు సౌందర్య లహరి, కనకధారాస్తోత్రాలతో పాటు వివిధ దేవతా స్తోత్రాలు పారాయణం చేస్తూ సవివరంగా అర్థమయ్యే రీతిలో భక్తులకు వివరించారు.
అలాగే ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... దేశాన్ని కాపాడడానికి సైనికులు, దేశభక్తులు ఎంత కష్టపడుతున్నారో అలాగే సనాతన ధర్మాన్ని రక్షించడానికి ప్రతి ఒక్కరు కష్టపడాలని తెలిపారు. రాజకీయాలే ముఖ్యమని భావించకుండా ధర్మాన్ని నిలబెట్టడానికి కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన కూడా ధర్మాన్ని బండి సంజయ్ విడిచిపెట్టలేదని, ధర్మ పరిరక్షణ కోసం ఆయన చేస్తున్న కృషికి అమ్మవార్ల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని తెలిపారు.
ఇక్కడ శ్రీ మహాశక్తి దేవాలయాన్ని నిర్మించి ధర్మ రక్షణ కోసం బండి సంజయ్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. నేడు ఈ దేవాలయాన్ని దర్శించడానికి ఎన్నో వేలమంది వస్తున్నారని, అమ్మవారి దీక్షను ఎంతో మంది చేపట్టడం, వివిధ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం సంతోషకరంగా ఉందన్నారు.
పసుపు కొమ్ముల అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారు....
శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం రోజున పసుపు కొమ్ముల అలంకరణలో, గాయత్రి దేవి రూపంలో దుర్గా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం లింగార్చన నిర్వహించారు.
బుధవారం అమ్మవారికి శాకాంబరి అలంకరణ
శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బుధవారం రోజున శ్రీ మహాశక్తి దేవాలయ శ్రీ మహాదుర్గ అమ్మవారు శాకంబరీ అలంకరణలో, శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.