08-08-2025 12:00:00 AM
బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వాన్ని నాటకీయంగా పడగొట్టి ఆగస్టుకు ఏడాదయింది. దేశాన్ని ఉక్కుపిడికిట పట్టిన హసీనా పాలనను అంతం చేయాలని సైన్యం, అధికార గణం, విద్యార్థులు కలిసి తిరుగుబాటు చేసి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రధాన సలహాదారుగా ప్రొఫెసర్ మొహమ్మద్ యూనస్ ఏడాదిగా ఇదిగో అదిగో అంటూ మొత్తానికి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని ప్రటకించారు.
హసీనా పాలన అంతా నియంతృత్వ పోకడేనంటూ ఎగసిపడ్డ నిరసనల నుంచి బంగ్లాదేశ్‌లో పరిస్థితులు ఇప్పుడు పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మారాయి. రాజకీయ ప్రత్యర్థులను, ఇస్లామిక్ ఛాందసవాద గ్రూప్‌లను సైన్యం, పోలీస్ బలగాలతో అణచి చెడ్డపేరు మూటగట్టుకున్న హసీనా చివరికి, దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించే అవకాశం లేకుండా దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది.
హసీనా నియంతృత్వ పోకడ అనేక ఏళ్లుగా యువతలో నైరాశ్యం పెంచింది. బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో పాల్గొన్న కుటుంబాల వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించడం, మరోవైపు పెరిగిన నిరుద్యోగం, ధరల పెరుగుదల, తీవ్రవాద ఇస్లామిక్ గ్రూప్ అణచివేత, మిలటరీ ప్రాపకం అవామీ లీగ్ ప్రభుత్వంపై ప్రజల నిరసనలకు కారణాలయ్యాయి.
దేశవ్యాప్తంగా చెలరేగిన విద్యార్థి ఉద్యమం మొదట వివిధ సమస్యలపై పోరాటంగా మొదలైనా, చివరి దశలో విద్యార్థులకు మద్దతుగా ఇస్లామిక్ గ్రూప్‌లు, ప్రభుత్వ ఉద్యోగులు, సైనిక దళాల్లో ఒక వర్గం నిలవడంతో హసీనా పదవీచ్యుతురాలిని చేయడమే లక్ష్యమైంది. లక్షలాది మంది రోడ్లపై నిరసనలకు దిగడంతో జరిగిన హింసాత్మక ఘటనల్లో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభు త్వం మారింది. దానికి మద్దతు ఇచ్చిన సైన్యం దేశంలో ప్రజాస్వామిక విధాన పునరుద్ధరణకు పట్టుబట్టింది.
నిజానికి దేశంలో సైనిక పరిపాలన వచ్చినా, దానిని ప్రతిఘటించే పరిస్థితులు కనిపించలేదు. అయినా బంగ్లాదేశ్ సైనికాధికారులు దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ వైపే మొగ్గు చూపారు. ప్రజాస్వామ్యయుతంగా, పాలనా సంస్కరణలు తెస్తామని ప్రకటించిన తాత్కాలిక ప్రభుత్వం వాటిని ఎంతవరకు తెచ్చిందనేది ప్రశ్నగానే మిగిలింది. దేశంలో ఏడాది పాటు అరాచకం రాజ్యమేలింది. ఒక వదంతి, ఒక ప్రాంతాన్నంతా అల్లకల్లోలం చేసిన ఘటనలున్నాయి.
గంపు స్వామ్యం రాజ్యమేలింది. మైనారి టీల మీద, ముఖ్యంగా హిందువుల మీద అనేక దాడులు జరిగాయి. పోలీసులు, అధికార యంత్రాంగం చేష్టలుడిగి ప్రేక్షక పాత్రకు పరిమితం కావాల్సి వచ్చింది. హసీనా భారత్‌కు దగ్గరగా మెసిలారనో, పదవి కోల్పోయిన అధ్యక్షురాలికి భారత్ ఆశ్రయం ఇచ్చిందనో.. యూనస్ నాయకత్వం లోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత్ వ్యతిరేక విధానాలను అనుసరించింది.
రాజకీయంగా, సిద్ధాంతపరంగా బంగ్లాదేశ్ ఇప్పుడు నాలుగు రోడ్ల కూడలిలో నిలబడిందనే చెప్పాలి. హసీనా హయాంలో జైలు పాలైన ఉగ్రవాదులకు ఇప్పుడు స్వేచ్ఛ లభించింది. అన్సర్ అల్ బంగ్లా వంటి పాత ఉగ్రవాద గ్రూపులు తిరిగి తలెత్తేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. బంగ్లాదేశ్‌లోని ఈ ఉగ్రవాద గ్రూప్‌లతో దక్షిణాసియా దేశాలకు ముప్పు రాక మానదని చెప్పలేం.
బంగ్లా విముక్తి పోరా టంలో ప్రజల్ని ఊచకోత కోసిన జమాతె ఏ ఇస్లామీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎప్పటి నుంచో నిషేధమున్నప్పటికీ, రాజకీయంగా శూన్యం ఏర్పడి న బంగ్లాదేశ్‌లో జమాత్, దాని అనుబంధం సంస్థలు వచ్చే ఎన్నికల తర్వాత అధికారంపై పట్టు సాధించరనే గ్యారెంటీ లేదు. కనుక ప్రజాస్వా మ్య పునరుద్ధరణపై ముసురుకునేది చీకట్లే.